గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి
సాగు–తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఏపీ రైతు సంఘం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రైతు సంఘం ప్రతినిధి బృందం శనివారం గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ బృందంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణతో పాటు రైతులు సోమన్న, వెంకటేశ్వర్లు, రంగస్వామి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జి. రామకృష్ణ మాట్లాడుతూ… గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. గత దశాబ్ద కాలంగా పాలకులు ఈ ప్రాజెక్టుపై హామీలు ఇస్తున్నప్పటికీ, పనులు ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తైతే కర్నూలు జిల్లాకు సాగు, తాగునీటితో పాటు కేసీ కెనాల్‌కు నిరంతరాయంగా నీటి సరఫరా చేయవచ్చని తెలిపారు.
ఇంతటి కీలక ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం రైతులకు హామీలు ఇస్తూ మోసగించడం తప్ప ప్రాజెక్టు పురోగతిపై చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై ఆయన ప్రశ్నించారు.
కర్నూలు జిల్లా నిత్యం కరువుతో పోరాడుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రాజెక్టులు అత్యవసరమని, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం ద్వారా సుమారు 20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని నీటిపారుదల నిపుణులు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, అవి అమలు దశకు చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.అలాగే గుండ్రేవుల రిజర్వాయర్‌తో పాటు ఆర్డీఎస్ కుడి కాలువ, మేలుగనూరు వరద కాలువ, వేదవతి వంటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాట కమిటీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
