నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి

నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి

యాక్షన్ ప్లాన్ రూపొందించాలి: కలెక్టర్ డా.ఏ.సిరి.

కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఆర్థికాభివృద్ధి వేగవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా జిడిడిపి పెంచే విధంగా సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్పెషల్ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళికపై స్పెషల్ అధికారులు, సంబంధిత సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి సంబంధించి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో అన్ని నియోజకవర్గాలు 85 శాతం పైగా స్కోరు సాధించి ‘గ్రేడ్-ఏ’లో నిలిచినప్పటికీ, అక్కడితో సంతృప్తి చెందకుండా 2026-27లో 90 శాతం పైగా సాధించి ‘గ్రేడ్-ఏ ప్లస్’లో నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డేటా ఎంట్రీను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయడం కీలకమని స్పష్టం చేశారు.


రాష్ట్ర విభజన అనంతరం వ్యవసాయ రంగం వాటా పెరిగినప్పటికీ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయంగా తగ్గుదల నమోదైందన్నారు. ముఖ్యంగా సేవా రంగ ఆదాయం 10 శాతం కంటే ఎక్కువ తగ్గడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిందన్నారు. పరిశ్రమల స్థాపన, సేవా రంగ అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు ద్వారా తలసరి ఆదాయం పెంచవచ్చని పేర్కొన్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను సమర్థంగా అమలు చేస్తే జిల్లా జిడిపి ఆటోమేటిక్‌గా పెరుగుతుందని వివరించారు.


జిల్లా భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హార్టికల్చర్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ వర్షపాతం, పొడి వాతావరణ పరిస్థితుల్లో మల్లె సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో టమాట, ఉల్లిపాయ పంటలను ప్రోత్సహించవచ్చని, అయితే ‘ఎల్ నినో’ ప్రభావం దృష్ట్యా వర్షాధారిత ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


వ్యవసాయంలో పత్తి, కందులు, శనగలు, మొక్కజొన్న ప్రధాన పంటలని పేర్కొంటూ, పశుసంవర్థక రంగంలో గుడ్లు, మాంసం ఉత్పత్తి బాగున్నప్పటికీ పాల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని అన్నారు. దీనిని మెరుగుపరచేందుకు ‘సెక్స్ సార్టెడ్ సీమెన్’ విధానాన్ని ఉపయోగించి ఆడ దూడల ఉత్పత్తి పెంచుతున్నట్లు తెలిపారు.


అటవీ, మత్స్య రంగాల్లో వృద్ధి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ తయారీ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
P4 కార్యక్రమం కింద లబ్ధిదారుల కుటుంబాలను గుర్తించి, వారి అవసరాలైన ఉపాధి, నైపుణ్యాలు, గృహం, ఇంటర్నెట్ వంటి అంశాలను గుర్తించడం ద్వారా తలసరి ఆదాయం పెంపునకు దోహదం చేస్తుందని తెలిపారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని మార్గదర్శకులను గుర్తించాలన్నారు.


మార్చి 30న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రుల సమక్షంలో ‘బడ్జెట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో కూడా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అదే రోజు రాష్ట్ర స్థాయి P4 కార్యక్రమం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభమవుతుండగా, జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించాలన్నారు.


సమావేశంలో సీపీఓ భారతి, హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ రమణ రెడ్డి, డీపీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి, ఆదోని ఇన్‌చార్జ్ సబ్ కలెక్టర్ అజయ్, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply