ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంతోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంతోత్సవాలు

నేటి పూర్ణాహుతితో పరిసమాప్తం
పుష్పార్చనతో భక్తులను అలరించిన అమ్మవారి సేవలు

ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో వసంతోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన పుష్పార్చన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల తొమ్మిదవ రోజు శుక్రవారం అమ్మవారికి విభిన్న రకాల పుష్పాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, మల్లెపువ్వులు, లిల్లీలు, తులసి దళాలు, నీలి తామరలు, తెలుపు మరియు పసుపు రంగుల చామంతి పూలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. ఈ పుష్పాలంకరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, పాలకమండలి సభ్యులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూర్ణాహుతితో ఉత్సవాల ముగింపు..

వసంతోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం (మార్చి 28) ఉదయం 9 గంటలకు నవరాత్రుల పూర్ణాహుతి, ఉదయం 11 గంటలకు శ్రీరాములవారి పట్టాభిషేక మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశముందని పేర్కొన్నారు.

Leave a Reply