WAR | మాంసప్రియులకు చేప షాక్..

WAR | మాంసప్రియులకు చేప షాక్..

WAR | మాంసప్రియులకు చేప షాక్.. డీజిల్ కొరతతో నిలిచిన చేపల వేట
మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం
బ్రెంట్ క్రూడ్ పెరుగుదలతో డీజిల్ సంక్షోభం
మార్కెట్‌లో చేపల సరఫరా తగ్గుదల
సామాన్యుడికి ఖరీదైన ఆహారంగా చేప

WAR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ముదురుతున్న, యుద్ధ జ్వాలలు ఇప్పుడు సామాన్యుడి వంటగది వరకు చేరాయి. సాధారణంగా యుద్ధం వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అందరికీ తెలుసు. కానీ, ఆ యుద్ధం సముద్ర గర్భంలోని చేపల ధరలను కూడా పెంచేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు మాంసప్రియులకు ఇదే పెద్ద షాక్. చికెన్, మటన్ ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి చేపలు కూడా చేరబోతున్నాయి.

WAR | డీజిల్ కొరతతో నిలిచిన వేట

చేపల వేట అనేది పూర్తిగా డీజిల్‌పై ఆధారపడి ఉంటుంది. పశ్చిమాసియాలో (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య) నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. సముద్ర మార్గాల్లో భద్రతా కారణాల దృష్ట్యా ఆంక్షలు విధించడంతో భారత్‌కు వచ్చే చమురు రవాణా నెమ్మదించింది. దీని ప్రభావం మన తీర ప్రాంతాలపై స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖపట్నం లాంటి ప్రధాన ఫిషింగ్ హార్బర్లలో గత పది, పదిహేను రోజులుగా డీజిల్ కొరత తీవ్రమైంది. ఒక మెకనైజ్డ్ బోటు వేటకు వెళ్లాలంటే వేల లీటర్ల డీజిల్ అవసరం. కానీ స్టాక్ లేకపోవడంతో బోట్లు హార్బర్‌కే పరిమితమయ్యాయి.

WAR

WAR | మత్స్యకారుల గుండె కోత

విశాఖ హార్బర్ నుంచి వేలాది బోట్లు సముద్రంలోకి వెళ్లడం ఆగిపోవడంతో వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింది. రోజువారీ ఆదాయంపై ఆధారపడే గంగపుత్రులు ఇప్పుడు పనులు లేక ఆర్థికంగా చితికిపోతున్నారు. కేవలం విశాఖ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న తీరప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సముద్రంలోకి వెళ్లే సాహసం చేసినా, ఇంధన ధరల భారం వల్ల వచ్చే లాభం కంటే ఖర్చే ఎక్కువ అవుతోందని మత్స్యకారులు వాపోతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $107 దాటడంతో దేశీయంగా డీజిల్ కోటాపై ఆంక్షలు అమలవుతున్నాయి. దీనివల్ల ఫిషింగ్ బోట్లకు ఇచ్చే డీజిల్ సబ్సిడీలు తగ్గడం లేదా అసలు సరఫరానే నిలిచిపోవడం వంటి వార్తలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో వారం కొనసాగితే మార్కెట్లో చేపల లభ్యత 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

WAR

WAR | ఖరీదైన ఆహారంగా ‘చేప’

మార్కెట్‌కు చేపల రాక (Supply) తగ్గడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే రకాలు కూడా ఇప్పుడు కిలోకు రూ. 100 నుంచి రూ. 200 వరకు అదనంగా పలుకుతున్నాయి. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి, ఆదివారం పూట ముక్క లేనిదే ముద్ద దిగని మాంసప్రియులకు ఈ ధరల పెరుగుదల గుదిబండలా మారింది. యుద్ధం త్వరగా ముగిసి, చమురు సరఫరా సాధారణ స్థితికి రాకపోతే చేపలు సామాన్యుడికి ‘కల’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.