చింతామోహన్ ఘాటు వ్యాఖ్యలు…

చింతామోహన్ ఘాటు వ్యాఖ్యలు…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల అంచనాలు, సామాజిక అసమానతలు, రాష్ట్ర అభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై తన అంచనాలను వెల్లడించారు.
రాష్ట్రాల రాజకీయాలపై అంచనాలు కేరళలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రి పదవికి ఇద్దరు నాయకుల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలిపారు.
తమిళనాడు, పాండిచ్చేరిలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ స్వల్ప మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు. అస్సాం పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. అమరావతి – రాయలసీమ వివాదం అమరావతిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రజలు అమరావతిని “కమ్మరావతి”గా అభివర్ణిస్తున్నారని, ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయని విమర్శించారు.
ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుపై బంధుప్రీతి ఆరోపణలు చేస్తూ, రాయలసీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి అమలు చేయలేదని, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. అభివృద్ధి అసమానతలపై విమర్శ అమరావతిలో భారీగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, కడప వంటి ప్రాంతాల్లో ప్రాథమిక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని అన్నారు. రెండు సంవత్సరాల్లో కర్నూలులో గణనీయమైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
సామాజిక అసమానతలపై వ్యాఖ్యలు దళితులపై ఇంకా అంటరానితనం కొనసాగుతోందని, మత మార్పిడి జరిగినా సామాజిక స్థితి మారడం లేదని అన్నారు. మాల, మాదిగలు బైబిల్ పట్టుకున్నా ఉన్నత కులాల్లోకి మారలేరని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పులపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించేందుకు 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజ్యాంగ సవరణ చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శ ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని బలహీనంగా అభివర్ణించారు. గతంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్థాయిలో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.
ఇతర కీలక అంశాలు…
తుంగభద్ర నది ఇసుక హైదరాబాద్, బెంగళూరుకు తరలిపోతున్నదని ఆరోపించారు. యుద్ధ పరిస్థితుల వల్ల దేశంలో ఆర్థిక, సామాజిక భయాందోళనలు పెరిగాయని తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే మెస్ బిల్లుల విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం తగ్గింపులు చేసిందని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ రత్నం తదితరులు పాల్గొన్నారు.
