వందేళ్ల వైభవం.. నిరుపమాన ప్రగతికి నిదర్శనం…

వందేళ్ల వైభవం.. నిరుపమాన ప్రగతికి నిదర్శనం…

ఏయూ స్నాత‌కోత్స‌వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్, ఛాన్స‌లర్ అబ్దుల్ నజీర్
ఘ‌నంగా ఆంధ్ర విశ్వ‌క‌ళాప‌రిష‌త్ 91, 92వ స్నాత‌కోత్స‌వం, అవార్డుల ప్ర‌దానోత్స‌వం
బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మ‌న్, ఏయూ పూర్వ విద్యార్థి డాక్ట‌ర్ పూర్ణచంద్ర‌రావు స‌గ్గుర్తి
కేంద్ర సాహిత్య‌ అకాడ‌మి అవార్డు గ్ర‌హీత త‌ల్లావ‌జ్జ‌ల‌ ప‌తంజ‌లి శాస్త్రిల‌కు డాక్ట‌రేట్ అవార్డుల ప్ర‌దానం

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : వందేళ్ల వైభ‌వానికి, నిరుప‌మాన ప్ర‌గ‌తికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్ర‌త్యేక‌ నిద‌ర్శ‌న‌మ‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో బుధ‌వారం నిర్వహించిన 91వ, 92వ స్నాతకోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయ‌న‌ విశ్వవిద్యాలయ వందేళ్ల ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. “ఒక విద్యాసంస్థగా ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం, నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జ్ఞానపీఠంగా అవతరించడం విశేషం” అని ఉద్ఘాటించారు.

గత వందేళ్లలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వేలాది మంది విద్యార్థులను సమాజానికి అందించి, వారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించడం ఈ సంస్థ గొప్పతనానికి నిదర్శనమన్నారు. విజ్ఞానం, విలువలు, సేవా దృక్పథం కలిగిన పౌరులను తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందన్నారు. విశ్వవిద్యాలయం స్థాపనలో ప్రముఖులైన సర్ సి.ఆర్. రెడ్డి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ వి.ఎస్. కృష్ణ వంటి మహనీయుల దూరదృష్టి, సేవలను ఈ సందర్భంగా గవర్నర్ స్మరించుకున్నారు.

నోబెల్ బహుమతి గ్రహీత సి.వి. రామన్, గణాంక శాస్త్రవేత్త సి.ఆర్. రావు వంటి గొప్ప వ్యక్తులు ఈ విశ్వవిద్యాలయానికి చెందినవారిగా నిలవడం గర్వకారణమని అన్నారు. ప్ర‌స్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాక్ ఏ++ హోదాతో పాటు ఐఎస్వో గుర్తింపుతో విద్యా ప్రమాణాలను నిలబెట్టుకుంటూ, పరిశోధన, స్టార్టప్‌లు, పేటెంట్ నమోదు, క్రీడలు, సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉందని గవర్నర్ గుర్తు చేశారు.

డిగ్రీ సాధ‌న ముగింపు కాదు.. కొత్త ప్ర‌యాణానికి ఆరంభం

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డిగ్రీ సాధన ఒక ముగింపు కాదు, కొత్త ప్రయాణానికి ఆరంభమని గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం, నైతిక విలువలతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని సూచించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో రాజకీయాలకు దూరంగా ఉండి విద్య, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. చివరిగా, పట్టాలు, పతకాలు అందుకున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ, వారు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

పూర్ణచంద్ర‌రావు స‌గ్గుర్తి, త‌ల్లావ‌జ్జ‌ల ప‌తంజ‌లి శాస్త్రిల‌కు డాక్ట‌రేట్ అవార్డుల ప్ర‌దానం

కార్య‌క్ర‌మంలో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మ‌న్ డాక్ట‌ర్ పూర్ణచంద్ర‌రావు స‌గ్గుర్తికి, కేంద్ర సాహిత్య‌ అకాడ‌మీ అవార్డు గ్ర‌హీత త‌ల్లావ‌జ్జ‌ల‌ ప‌తంజ‌లి శాస్త్రిల‌కు గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా అవార్డులను ప్ర‌దానం చేశారు. వీరితో పాటు జియో, సివిల్ ఇంజ‌నీరింగ్ విభాగాల‌కు చెందిన ప్రొ. పి. జ‌గ‌దీశ్వ‌ర‌రావు, ప్రొ. సి.ఎన్.వి. స‌త్య‌నారాయ‌ణ రెడ్డిల‌కు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు అంద‌జేశారు.

ఫ్యాక‌ల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగం నుంచి ఎనిమిది మంది, ఫ్యాక‌ల్టీ ఆఫ్ లా నుంచి ఇద్ద‌రు, ఫ్యాక‌ల్టీ ఆఫ్ సైన్స్, ఇంజ‌నీరింగ్, ఫార్మాస్యూటిక‌ల్ సైన్స్స్ నుంచి ఏడుగురు మొత్తం 17 మంది రీసెర్చ్ మెడ‌ల్స్ అందుకున్నారు. ఇదే క్ర‌మంలో 13 మంది రీసెర్చ్‌ ప్రైజ్‌లు, ఏడుగురు ఎం.ఫిల్ డిగ్రీల‌ను, 441 మంది పీహెచ్డీ డిగ్రీల‌ను తీసుకున్నారు. యూజీ పీజీ మెడ‌ల్స్ 174, యూజీ పీజీ ప్రైజులు 437, మెత్తం యూజీ పీజీ ప్రైజులు, మెడ‌ల్స్ 148 మంది అతిథుల చేతుల మీదుగా స్వీకరించారు.

ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతూ కీలక స్థానాన్ని సంపాదించుకుంటోందని, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే అవకాశాలు ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్, ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో భారత్ 7.5 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి సంస్థగా నిలుస్తోందని, ఆస్తుల పరంగా అమెరికాలో రెండో స్థానంలో ఉండటంతో పాటు మార్కెట్ విలువ పరంగా కూడా ప్రముఖ స్థానాన్ని సంపాదించిందన్నారు. 2025లో 30.5 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని ఆర్జించడం సంస్థ బలాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు.

విశాఖతో, ఏయూతో ఆత్మీయ అనుబంధం

తన స్వస్థలమైన విశాఖపట్నంలో ఈ గౌరవాన్ని అందుకోవడం గర్వకారణమని డాక్టర్ పూర్ణ చంద్రరావు అన్నారు. తన కుటుంబంలో ఎనిమిది మంది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారని, తన మావయ్య ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు 1984-87 మధ్య విశ్వవిద్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

“Can-do attitude” (చేయగలను అనే నమ్మకం)తో ముందుకు సాగాలని, “If it is to be, it is up to me” అనే సూత్రాన్ని జీవితంలో ఆచరణలో పెట్టాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక, వైద్య రంగాల్లో భారతీయులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, పట్టభద్రులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. వారు తమ ప్రతిభతో దేశానికి, సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఎస్‌డీజీ లక్ష్యాల సాధనలో గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలి: వీసీ జి.పి. రాజశేఖర్

ఆంధ్ర విశ్వవిద్యాలయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనలో గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలని, విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలు ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాల్లో నిలవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి జి.పి. రాజశేఖర్ ఆకాంక్షించారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయ పురోగతికి ఛాన్సలర్ అందిస్తున్న ప్రోత్సాహం, మార్గదర్శకత్వం కీలకమని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడెమిక్ సెనేట్ సభ్యులు, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ విద్యాశాఖ ఉన్నతాధికారులు, కార్యదర్శి, ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ తదితరులు శతాబ్ది వేడుకలకు అందించిన సహకారం విశేషమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి అందిస్తున్న ఆదరణ, నిధుల సంస్థల సహకారం అభినందనీయమన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వారి అంకితభావం, ఉత్సాహం, జిజ్ఞాస వల్లనే విశ్వవిద్యాలయం ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తన రెండవ శతాబ్దంలోకి అడుగుపెడుతున్న ఈ కీలక సమయంలో విజ్ఞానం, సమగ్రత, ఆవిష్కరణలతో పాటు దేశం, సమాజం పట్ల ఉన్న బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, జాయింట్ క‌లెక్ట‌ర్ గొబ్బిళ్ల విద్యాధ‌రి, ఏయూ పూర్వ వీసీలు, ఇత‌ర యూనివ‌ర్శిటీల‌కు చెందిన ప్ర‌స్తుత‌ వీసీలు, ఏయూ రెక్టార్, రిజిస్ట్రార్, ఆచార్యులు, , ఇత‌ర ప్ర‌ముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply