మిట్టల్‌కు మెగా రాయితీలు…

మిట్టల్‌కు మెగా రాయితీలు…
విశాఖ స్టీల్‌కు నిర్లక్ష్యం? సైలెంట్ కిల్లింగ్ దారుణం
ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్రాలు స్పష్టత ఇవ్వాలి
సేల్‌లో విలీనం లేక సమాన రాయితీలు ఇవ్వాలి
స్పష్టత లేని జాబ్ క్యాలెండర్
లక్షల ఖాళీలు ఉన్నా తక్కువ నోటిఫికేషన్లు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, మిట్టల్ స్టీల్ ప్రాజెక్టుకు భారీ రాయితీలు ప్రకటిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సుమారు రూ 25 వేల కోట్ల రాయితీలు, 15 సంవత్సరాల పాటు జీఎస్టీ మినహాయింపులు, తక్కువ ధరకు విద్యుత్, సొంత పోర్ట్, నీటి వనరులు వంటి అనేక సదుపాయాలు కల్పించడం పట్ల ప్రశ్నలు లేవనెత్తారు.
అదే సమయంలో పబ్లిక్ సెక్టార్‌కు చెందిన విశాఖ ఉక్కుకు అవసరమైన మద్దతు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్లాంట్ స్థాపనకు ప్రజలు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, 32 మంది బలిదానాలు, వేలాది మంది భూముల త్యాగాలతో ఈ పరిశ్రమ ఏర్పడిందన్నారు. ఒకప్పుడు దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఈ ప్లాంట్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతుండగా, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు.

ప్రైవేటీకరణ అంశంపై ఇంకా స్పష్టత లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, 2021లో ప్రకటించిన నిర్ణయానికి ఇప్పటికీ మార్పు లేదని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ ఉండదని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని, లేకపోతే మిట్టల్‌కు ఇచ్చినట్లే రాయితీలు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇవ్వాలని సూచించారు. క్యాప్టివ్ మైన్స్, ముడిసరుకు సరఫరా, పన్ను రాయితీలు వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు.

ఇప్పటికే రూ.20 వేల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న ప్లాంట్‌కు తగిన సహాయం అందించడం లేదన్నారు. ఇక జాబ్ క్యాలెండర్‌పై కూడా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 1.80 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ, తక్కువ పోస్టులకే నోటిఫికేషన్లు ఇవ్వడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని, తొలగించిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.
