ఈరోజు చింతనలో ప్రత్యేక కథనం..
ఈరోజు చింతనలో ప్రత్యేక కథనం..
“సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యా నంతరం సుఖం / చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ”. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం రెండూ ఒక దాని తర్వాత ఒకటి చక్రభ్రమణంలా జీవితంలో వస్తూపోతుంటాయి. ఇది సృష్టి ధర్మం. లోకూ సహజమైన ఈ సుఖదుఃఖాలకు పొంగిపోవడం, క్రుంగిపోవడం కూడదు. సుఖం కలిగినప్పుడు ఆతర్వాత ఎంతటి దుఃఖం కలిగినా ఎదుర్కొనే మనస్థైర్యాన్ని, అలాగే దుఃఖం కల్గినప్పుడు రాబోయే సంతోషకరమైన రోజుల కోసం ఎదురు చూసే సహనాన్ని సాధనతో అలవరచుకోవాలి. సముద్రంలోని ఆటుపోట్లవలె నిరంతరం మనల్ని కుదుపుతున్న పరిస్థితులకు భయపడి, అనవసరమైన అర్ధంతర నిర్ణయాలు తీసుకోవడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఆశావహ దృక్పథంతో, సాను ధోరణితో ముందుకు సాగిపోవాలే కానీ, నిరాశతో ఆగిపోరాదు. అంతేకాదు. ఆపదలు తప్పించుకోడానికి మన వంతు ప్రయత్నమూ చేయాలి.
ఈ సందర్భంలో అప్పయ్య దీక్షితులు రచించిన “కువలయానందం” అనే గ్రంథంలోని ఈ శ్లోకం ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తోందో చూడండి: “రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం / భాస్వాన్ ఉదేశ్యతి హసి ప్యతి పంకజశ్రీః / ఇత్థం విచింత యతి కోతే ద్విరే / హంత హంత నలి నీం గజ ఉజ్జహార”. ఒక తేనెటీగ / సాయం వేళ కమలంలోని మకరందాన్ని ఆస్వాదించడానికి అందులోకి చొరబడింది. ఆ పువ్వులోని తియ్యని మకరందాన్ని అది ఆరగిస్తుండగానే సూర్యాస్తమయం కావడం, ఆ కమలం ముకుళిం చుకుపోవడం, అందులో తేనెటీగ చిక్కుకుపోవడం జరిగిపోయాయి. అప్పుడది అనుకొన్నదట…“ఈ రాత్రి గడిచిపోతుంది. తెల్లవారుతుంది. కమలం తిరిగి వికసిస్తుంది. నేను స్వేచ్ఛగా అప్పుడు ఇందులోంచి బయటపడగలను” అని. నిజమే. అలా ధైర్యంగా, ఆశావహంగా రాబోయే మంచి సమ యం కోసం ఎదురు చూడడం మెచ్చుకోదగినదే.
మామూలుగా అయితే అలాగే జరిగేది. కానీ, విధి బలీయమైనది కదా ! ఇంకా తెలతెలవారుతుండగానే నదిలో జలకాలాడడానికి అటుగా వచ్చిన ఒక ఏనుగు ఆ కమలాన్ని తన తొండంతో పెరికివేసి నేలకేసి కొట్టిందట. పాపం తేనెటీగకు కాలగతి తప్పలేదు. మంచి సమయం కోసం ఎదురు చూస్తూ, నిష్క్రి యాపరత్వంతో పడి ఉండక, ఆ కమలాన్ని ఛేదించుకొని బయటపడే ప్రయత్నం చేసి ఉంటే ఆ తేనెటీగ తన మరణాన్ని తప్పించుకొని ఉండేది. కాలం పైనా, దైవం మీద పూర్తి భారం వేసి, మానవ ప్రయత్నం చేయకుండా మానుకొంటే గాలిలో దీపము పెట్టి దేవుడా నీదే భారమనుకొనే మూఢ భక్తునిలాగా వెర్రివాళ్ళమవుతాము. అందుకే స్వామి వివేకానంద కఠోపనిషత్తులోని “ఉత్తిష్టత / జాగ్రత/ ప్రాప్యవరాన్నిరోధత” (నిద్రమత్తును వదిలించుకొని లేచి జాగరూకతతో గమ్యం వైపు ఉత్సాహంగా దూసుకుపోండి) అనే వాక్యాన్ని తమ ప్రసంగాలలో పదేపదే చెప్పేవారు. మరి సమయం వృథా చేయకుండా విద్యార్థులు, యువకులు, పెద్దలు కూడా కార్యోన్ముఖులమవుదాం.
-డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
