వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ గందరగోళం..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రజల డిమాండ్ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంత వెనక్కి జరిపినప్పటికీ, హైదరాబాద్ మరియు తాండూర్ వైపుకు వెళ్లే వాహనాలకు సరైన మార్గదర్శక ఏర్పాట్లు చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ చౌరస్తా గుండా వికారాబాద్ నుంచి హైదరాబాద్, తాండూర్ వైపుకు పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఎటువంటి దిశా సూచికలు లేదా ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు లేకపోవడంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు.

చౌరస్తాలో మార్పులు చేసినప్పటికీ, వాహనాలు ఏ దిశగా వెళ్లాలో స్పష్టత లేకపోవడంతో ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఆర్ అండ్ బి, ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి, చౌరస్తాలో స్పష్టమైన సూచిక బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను సక్రమంగా నిర్వహించాలని వారు కోరుతున్నారు.