పీఎన్‌జీ కనెక్షన్ కావాలా..

పీఎన్‌జీ కనెక్షన్ కావాలా..
91549 70454 నంబరుకు కాల్ చేయండి
ప్రయోజనాలతో పాటు పూర్తివివరాలు తెలుసుకోండి
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ : జిల్లాలో ఎవరికైనా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్ కావాలనుకుంటే కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) నంబరుకు కాల్ చేయొచ్చని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గృహాలు, హోటళ్లు, పారిశ్రామిక యూనిట్లు తదితరాలకు సురక్షితమైన, నిరంతర గ్యాస్ సరఫరా అందించేలా పీఎన్‌జీ కనెక్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. పీఎన్‌జీ ప్రయోజనాలతో పాటు పూర్తి వివరాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న సిబ్బంది వివరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని గ్యాస్ సరఫరా స్థితిగతులు, భవిష్యత్తు కార్యాచరణ తదితరాలపై జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి పౌర సరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సరఫరా వ్యవస్థను కొనసాగించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. సీఎం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్కడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వొద్దన్నారు. పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు సుస్థిర భవిష్యత్తు ఇంధన భద్రతకు సోపానాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
