సీనియర్ జర్నలిస్ట్ పూర్ణకు నివాళి..

సీనియర్ జర్నలిస్ట్ పూర్ణకు నివాళి..

విజయవాడ, పటమట. ఆంధ్రప్రభ : అనారోగ్యంతో మృతి చెందిన ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో సీనియర్ రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు (ఏబీఎన్ పూర్ణ) భౌతికకాయాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) సందర్శించి నివాళులర్పించారు. పడమటలంకలోని పూర్ణ నివాసానికి శుక్రవారం చేరుకున్న ఆయన పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పూర్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

జర్నలిజం పై అపారమైన ఆసక్తితో పని చేసిన పూర్ణ, వర్తమాన రాజకీయాల పై సంపూర్ణ అవగాహన కలిగిన జర్నలిస్టుగా నిలిచారని ఎంపీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆయన చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి బోప్పన బావ కుమార్, ఇతర టీడీపీ నాయకులు ఉన్నారు.

పూర్ణ మృతి బాధాకరం : గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడ – ఆంధ్రప్రభ : ఎబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు మృతి బాధాకరమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విచారం వ్యక్తం చేశారు. విజయవాడ పడమటిలంకలోని స్వగృహంలో పూర్ణ భౌతిక కాయానికి ఎమ్మెల్యే రాము నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందరికీ సుపరిచితుడిగా, ఆత్మీయుడిగా ఉండే మిత్రుడు పూర్ణ మృతి విచారకారమని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మెల్యే రాము అన్నారు. వ్యక్తిగతంగా తనకు మంచి స్నేహితుడైన పూర్ణ మృతి బాధాకరం అన్నారు.