సీనియర్లను తొక్కుకుంటూ.. సీఎం అయిన రేవంత్

సీనియర్లను తొక్కుకుంటూ.. సీఎం అయిన రేవంత్

  • ముఖ్యమంత్రి వార్నింగ్.. కాంగ్రెస్ సీనియర్లకే
  • రేవంత్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం
  • 6 గ్యారంటీలపై నిలదీయరు.. అవినీతిపై చర్యలుండవు
  • వందేమాతరంను బహిష్కరిస్తే చర్యలేవి..?
  • జాతీయ గీతంపై ప్రేమ లేదా..?
  • బీజేపీ ఉంటే.. ఎంఐఎం సభ్యులు కటకటాలకే
  • చేతగాని తనం వల్లే శాసనసభకు అగౌరవం
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభ : సీనియర్లను తొక్కుకుంటూ సీఎం సీట్లోకి వచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉగాది పర్వదినం శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం చైతన్యపురిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులున్నారని, వాళ్లందరినీ తొక్కుకుంటూ వెళ్లి సీఎం పదవి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఇటీవల కొంతమంది సీనియర్లు అసమ్మతి మీటింగ్లు పెడుతుండడంతో వారినుద్దేశించే వార్నింగ్ ఇచ్చినట్లు పరిస్థితి ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప ఈ తొక్కుకుంటూ పదవుల్లోకి వస్తామనడం ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.

రాహుల్ గాంధీ సైతం తొక్కుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డిపైనే ఆధారపడి ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారన్నారు. ఆ ఎన్నికల్లో సర్వేల దగ్గర నుండి పైసలు సమకూర్చే వరకు అన్ని బాధ్యతలు రేవంత్ రెడ్డికే అప్పగించారని, ఇదే విషయంపైనే మొన్న ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని చెప్పారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల భాష సైతం అట్లాగే ఉందని, రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతలు నిలదీయడం లేదని, బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

వందేమాతరం గేయాలాపన సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్, మండలి చైర్మన్, స్పీకర్, మంత్రుల సమక్షంలోనే మజ్లిస్ ఎమ్మెల్యేల బహిష్కరించడం దుర్మార్గమన్నారు. భారత జాతీయ గేయాన్ని, భారతమాతను అవమానించారన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులను మజ్లిస్ ధిక్కరించడం సరికాదన్నారు. సభలో గవర్నర్, సీఎం, స్పీకర్, మండలి ఛైర్మన్ సహా సభ్యులంతా ఉన్నారని, శాసనసభలో సభ్యులు తప్పు చేస్తే శిక్షించే అధికారం ఒక్క స్పీకర్కు మాత్రమే ఉందని, అయినా ఇంతవరకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఇచ్చిన తీర్పుపట్ల ప్రజల్లో చులకన భావన ఏర్పడిందని, ఈ తరుణంలో వందేమాతరం ఆలాపనను మజ్లిస్ బహిష్కరిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇలాంటి చర్యల వల్ల శాసన వ్యవస్థ, స్పీకర్ పట్ల ప్రజల్లో మరింత చులకన భావం ఏర్పడుతుందన్నారు. ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు స్పందించలేదన్నారు.

బీజేపీ అధికారంలో ఉండి ఉంటే ఎంఐఎం మెడలు పట్టి తప్పనిసరిగా వందేమాతరం ఆలపించేలా చర్యలు తీసుకునేవాళ్లమని, భారతీయ పౌరులంతా వందేమాతరం ఆలపించాల్సిందేనన్నారు. ఎవరైతే వ్యతిరేకిస్తే వాళ్లను కటకటాల్లోకి నెట్టి భారతీయత అంటే ఏమిటి? భారతీయత గొప్పదనం ఏమిటో చూపించేవాళ్లమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా మజ్లిస్ తీరును ఖండించాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి గుణం పాఠం చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేతలు పడుకున్నా వందేమాతరం గుర్తుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జూన్ నాటికి మొత్తం 6 వాయిదాలు రైతు భరోసా నిధులు జమ చేయాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు 3 వాయిదాలు మాత్రమే చెల్లించారన్నారు.

ఇన్ని రోజులు రైతులకు ఎందుకు పూర్తిగా రైతు భరోసా చెల్లించలేదని ప్రశ్నించారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. నేను వాస్తవాలు మాట్లాడుతుంటే కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని మాట్లాడుతున్నారన్నారు. రైతులంతా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఏపీలో లడ్డూ గురించి, తెలంగాణలో మూసీ గురించే చర్చ జరుగుతోందని, బీజేపీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రమే బీజేపీ వ్యతిరేకమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లుగా మూసి నిర్వాసితులందరికీ ఆ ప్రాంతంలోనే ఇళ్ల కట్టించి, పునరావాస సాయం అందించి మెరుగైన ఆసుపత్రులు అక్కడే నిర్మించి, ప్రతి చోట మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్లో వాళ్ల పిల్లలను చేర్పించిన తర్వతే మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలన్నారు.

ప్రజలు ఆశీర్వదించి ఓట్లే స్తనే పదవులు వస్తాయని, సీఎం భాష తీరు సరిగా లేదని, ప్రజలు ఏమనుకుంటున్నరో ఆలోచించకుండా మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకుల తీరు, భాష కూడా ఇలాగే ఉంటుందని, వాళ్లు 6 గ్యారంటీలపై కాంగ్రెస్ను నిలదీయరన్నారు. అలాగే బీఆర్ఎస్ అవినీతిపై రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోరని, ఎందుకంటే వాళ్లిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం ఉందన్నారు. 2029లో కాంగ్రెస్కు అధికారం రావడం కల్ల అని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కుతారన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏకు అనుకూల ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉందని, తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, కేరళలో శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించబోతున్నామన్నారు. 12 మంది ఎస్సీలను, ఏడుగురు ఎస్టీలను కేంద్ర మంత్రులుగా నియమించిన ఘనత బీజేపీదేనని, ఎస్టీ ఆదివాసీ మహిళకు, మైనారిటీ రాష్ట్రపతిగా అవకాశమిచ్చిన పార్టీ బీజేపీ మాత్రవెమనన్నారు.

Leave a Reply