ఆత్మహత్యా… పరువు హత్యా?

ఆత్మహత్యా… పరువు హత్యా?

  • ప్రేమించి పెళ్లి..
  • రెండు రోజులు తల్లిదండ్రులతో ఉండేలా పోలీసుల పంచాయతీ
  • రెండో రోజే శవంగా తేలిన వధువు

మాచర్ల, ఆంధ్రప్రభ : వారిద్దరూ ఒకే సామాజిక వర్గంకు చెందిన వారు . ఇద్దరూ ప్రేమించుకున్నారు. మేజర్లు ఐన వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో ఈనెల 4వ తేదీన ఇంటి నుండి వెళ్లారు. అలా వెళ్లిన వీరు ఈ నెల 13వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం లోని షిర్డీ సాయిబాబా మందిరంలో వివాహం చేసుకున్నారు.

అసలు ఏం జరిగింది?

మాచర్ల పట్టణంకు చెందిన కామనబోయిన చౌడమ్మ (21), మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన గంగనబోయిన నాగరాజులు ఒకే సామాజిక వర్గం వారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో ఈనెల 4వ తేదీన ఇంటినుంచి పారిపోయారు.దీంతో చౌడమ్మ తండ్రి చంద్ర శ్రీను పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

విచారణలో భాగంగా సీఐ వెంకటరమణ నాగరాజు తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి తమధైన శైలిలో కుమారుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని అన్నారు. తదనంతరం కొంతమంది పెద్దలు సర్ది చెప్పి రాజీ ప్రయత్నాలు చేయబోయారు. విషయం తెలుసుకున్న చౌడమ్మ తల్లిదండ్రులు స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని హడావుడి చేశారు. తమ కూతురు కనపడటం లేదు అని 4 రోజుల కిందట ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ హడావుడి చేశారు.

అనంతరం ప్రేమికులు ఇద్దరినీ పోలీసులు తీసుకు రావటంతో ఊపిరి పీల్చుకోవటంతో వివాహం చేసుకున్నారని తెలిసి హతాశయులయ్యారు. అయితే వధువు తాను భర్తతో వెళ్తాను, తల్లిదండ్రులతో వెళ్ళనని కరాఖండిగా చెప్పింది. అయితే అమ్మాయి తండ్రి సీఐ వెంకటరమణ కాళ్ళు పట్టుకొని వేడుకోవటంతో రెండు రోజులు తండ్రితో వెళ్లాలని వచ్చాక పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తామని నచ్చచెప్పి పంపించారు. గురువారం స్టేషన్ కు రావాల్సి ఉన్న వధువు బుధవారం ఊరి వేసుకొని శవంగా మారింది.

అన్నీ అనుమానలే..

మేజర్లు అయిన ప్రేమికులు వివాహం చేసుకొని వస్తే వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు స్టేషన్ లోనే పంచాయతీ నెరపి తల్లిదండ్రులతో పంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులతో వెళ్లిన వధువు బుధవారంతో గడువు ముగుస్తుందని తెలిసి ఉరి వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులను కాదనుకుని వెళ్లి పెళ్లి చేసుకున్న వధువు ఉరి వేసుకునేంత పిరికిదా? ఇవన్నీ ఒక ఎత్తయితే వధువు ఒంటిపై కమిలిన గాయాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నిజాలు బయటకు వచ్చేదాకా ఈ సస్పెన్స్ వీడదు

Leave a Reply