రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి

రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, ఆంధ్రప్రభ : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మహోత్సవం 2026 లో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైతులను కోరారు.బుధవారం వ్యవసాయ , ఉద్యానవన, ఆయిల్ ఫెడ్, అనుబంధ శాఖల అధికారులు, ఆర్టీసీ డిపో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి సంబంధించి రైతులకు ఎటువంటి సమస్య రాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తెలంగాణలో అతిపెద్ద పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రైతు భరోసా నిధుల విడుదల వంటి కార్యక్రమాలతో పాటు వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు , యంత్ర పరికరాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు, స్టాళ్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారని… నేరుగా శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రేపటి నుండి మొదలుకొని 22 వరకు నాలుగు రోజులపాటు వివిధ కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రైతులు ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, మార్కెటింగ్, ఉద్యనవన, ఆర్టీసీ తదితర శాఖలకు సంబందించిన అధికారులు పాల్గొన్నారు.
