ఇంద్రకీలాద్రిపై ఉగాది ఉత్సవాలు..
ఇంద్రకీలాద్రిపై ఉగాది ఉత్సవాలు..
వెండి రథం సిద్ధం, వసంతోత్సవాలకు శోభాయమాన సన్నాహాలు
మార్చి 19న తెలుగు నూతన సంవత్సర వేడుకలు
ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం
వెండి రథంపై అమ్మవారి ఊరేగింపు
భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఉగాది పండుగ, వసంతోత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియనుంది. తెలుగు నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని ఆలయ పరిసరాలు ఇప్పటికే ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా అమ్మవారి ఉత్సవాల కోసం వెండి రథాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేయడం భక్తుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. మార్చి 19 గురువారం రోజు న ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం కూడా భక్తులకు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వెండి రథంపై అమ్మవారి వైభవ ఊరేగింపు

వసంతోత్సవాల ముఖ్య ఆకర్షణగా నిలిచే వెండి రథోత్సవం ఈసారి మరింత వైభవంగా జరగనుంది. అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంకరించిన వెండి రథంపై అధిష్టింపజేసి ఇంద్రకీలాద్రి మాడ వీధుల్లో ఘనంగా ఊరేగిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగే ఈ ఊరేగింపు భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. ఉత్సవాల నిర్వహణ కోసం ఆలయ అధికారులు వెండి రథాన్ని శుద్ధి చేసి, మెరుగులు దిద్దే పనులను పూర్తి చేశారు.

రథం ఆకర్షణీయంగా మెరిసేలా అలంకరణలు చేపట్టడం విశేషంగా నిలిచింది. ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. తొక్కిసలాటకు తావులేకుండా సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు ఆలయ యంత్రాంగం సమగ్ర ప్రణాళిక రూపొందించింది.
