కౌలు రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం

కౌలు రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం

పి.జమలయ్య

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాల ప్రకారం కౌలు రైతుల రక్షణ- సంక్షేమానికి తక్షణమే నూతన కౌలు చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 22 నెలల కాలంలో కౌలురైతులకు ఇచ్చిన హమీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ద్వజమెత్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లాల్లో కలెక్టరేట్ ల వద్ద ఆందోళనలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని కలెక్టరు ఆఫీస్ వద్ద అందోళన నిర్వహించి డిఆర్ ఓ యం.లక్ష్మీ నరసింహ కి అంతపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పి.జమలయ్య మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటి తేదీ నుండే కౌలు రైతులకు సులభతరంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని, కౌలు రైతులకు ఆర్బిఐ నిబంధనల ప్రకారం రెండు లక్షల వరకు షూరిటీ లేని పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం రెండు లక్షల కోట్ల పైగా పంట రుణాలు ఇస్తే కౌలురైతులకు కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఆరుగాలం శ్రమించి పంటల పండిస్తున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేయకుండా చెమట చుక్క చిందించని భూ యజమానులకు వేల కోట్ల రూపాయలు అందజేయటం దుర్మార్గమన్నారు.

ప్రకృతి విపత్తులు, తెగుళ్లు వల్ల పంటలు దెబ్బతిని కౌలురైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మార్కెట్ కు వచ్చిన పంటలకు వ్యాపారస్తులు సిండికేట్ గా మారీ కౌలురైతుల కష్టార్జితాన్ని దోచుకు తింటుంటే రాష్ట్ర ప్రభుత్వ చోద్యం చూస్తుందన్నారు. వ్యవసాయ అప్పుల బాధలతో కూటమి పాలనలో 300 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 90శాతం కౌలురైతులేన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలురైతులును గుర్తించడానికి గుర్తింపు కార్డులు లేవని నిర్లక్ష్యంగా వ్యవహారించడం బాధాకరమని,కనీసం ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన మేరకైనా ఆత్మహత్య చేసుకున్న భాదిత కౌలురైతుల కుటుంబాలకు ఇప్పటి వరకు ఎక్సగ్రేషియా చెల్లించకుండా నిర్లక్ష్యం చేయటం కౌలురైతుల సంక్షేమ పట్ల శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుందన్నారు. బాధిత కుటుంబాలను అప్పులవాళ్ళు వేధిస్తున్నారని, వడ్డీ వ్యాపారస్తుల నుంచి, బ్యాంకుల నుండి కౌలు రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి మేకల డేవిడ్ మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు పథకాలు అమలు తీరు పర్యవేక్షించడానికి ప్రత్యేక యంత్రంగా ఏర్పాటు చేయాలని కోరారు.

కౌలురైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోటానికి వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెయ్యల వెంకటేశ్వరరావు,సంఘం జిల్లా నాయకులు చెరుకూరి శ్రీనివాసరావు, ఇస్లావత్ సాంబయ్య, జి.దేవరాజు తదితరులు పాల్గొన్నారు.