రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

పంచ సూత్రాలతో రైతన్న ఆర్థిక అభివృద్ధి సాధ్యం…
మంత్రి ఎన్ఎండి ఫరూక్..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలను అమలు చేస్తున్నాడని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. బుధవారం రైతన్న సేవలో… మన మంచి ప్రభుత్వం మరియు ‘రైతన్న! మీ కోసం’ పేరుతో రూపొందించిన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగానే కాకుండా, గౌరవప్రదమైన లాభసాటి రంగంగా మార్చడానికి కట్టుబడి ఉందన్నారు.

ప్రతి రైతు కుటుంబానికి ‘అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14 వెల రూపాయలు కేంద్రం రూ.6 వేలు కలిపి ఏటా 20 వెల రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో మూడవ విడత నిధులు కూడా విడుదలయ్యాయని గుర్తుచేశారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్ ఎఐ, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అనే ఐదు సూత్రాలతో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాయలసీమను ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బిందు, తుంపర సేద్యానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతరులకు 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు .

సాగులో ఏఐ , శాటిలైట్ సర్వేలు, డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, దీనికోసం ‘ఫార్మర్ యాప్’ ఏపీ ఎయిమ్స్ 2.0 అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఉల్లి, కోకో, ఆయిల్ పామ్ రైతులకు అదనపు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, నల్లబరి పొగాకు రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర కల్పించి ఆదుకున్నామన్నారు.

రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, యాలూరు వెంకటేశ్వర్ రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి, కొల్లి చంద్రశేఖర్ రెడ్డి, పుండరీశ్వర్ రెడ్డి, గోవింద నాయుడు, కృపాకర్, సుధాకర్, ఓబులేసు పలువురు రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.