బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి…

బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి…
- ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి పర్వేజ్ హైదర్
పెడన – ఆంధ్రప్రభ : పెడన మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పర్వేజ్ హైదర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ ( హెచ్ పి వి ) వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఈ టీకా ప్రధానంగా 14 సంవత్సరాల పూర్తయి 15వ సంవత్సరాలు పూర్తికాని బాలికలకు ఇవ్వబడుతుందని తెలిపారు.
ఈ టీకా వేయడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సమ్మతి తప్పనిసరిగా తీసుకుంటారని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలికలు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే టీకా వేస్తారని పేర్కొన్నారు. ఇక వేసుకున్న తర్వాత కనీసం 30 నిమిషాల పాటు ఆరోగ్య కేంద్రంలో ఉండాలని సూచించారు. పెడన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 275 మంది బాలికలకు హెచ్ పి వి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు పీహెచ్సీ వైద్యాధికారి పర్వేజ్ హైదర్ తెలిపారు. ప్రస్తుతం 152 డోసుల వ్యాక్సిన్ అందిందని, 51 మంది బాలికలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ వ్యాక్సిన్ అందించినట్లు పేర్కొన్నారు.
