రంజాన్ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా భారీ ఇఫ్తార్ విందు..

రంజాన్ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా భారీ ఇఫ్తార్ విందు..

పశ్చిమలో ఏర్పాట్లు చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)..
చిట్టినగర్ ఈద్గా ప్రాంగణంలో వేలాదిమంది ముస్లిం సోదరులతో ఆత్మీయ కలయిక..

చిట్టినగర్, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆధ్యాత్మికత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా భారీ ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో చిట్టినగర్ ఈద్గా ప్రాంగణం ఈ సాయంత్రం ఆత్మీయ వాతావరణంతో కళకళలాడనుంది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముగించుకునే సందర్భంలో నిర్వహించే ఇఫ్తార్ విందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేయడం ద్వారా సామరస్యానికి ప్రతీకగా నిలిచేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ విందుకు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు హాజరుకానుండగా, వేలాదిమంది ముస్లిం సోదరులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాల్గొనే వారందరికీ సౌకర్యవంతమైన వసతులు, ప్రత్యేక ఆహార ఏర్పాట్లు, ప్రార్థనల కోసం అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా సిద్ధం చేశారు.

చిట్టినగర్ ఈద్గా ప్రాంగణం ఇప్పటికే విద్యుత్ వెలుగులతో అలంకరించబడుతూ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రంజాన్ మాసం అందించే సౌహార్దం, పరస్పర గౌరవం, సహనం వంటి విలువలను ప్రజల్లో మరింత బలపరిచే దిశగా ఈ ఇఫ్తార్ విందు కీలకంగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.