లారీ యజమానుల సమస్యలపై చొరవ చూపండి..

లారీ యజమానుల సమస్యలపై చొరవ చూపండి..

25% లోపే పరిమితిని అనుమతించండి

కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు, వాహన్ సమస్యలపై తక్షణ చర్యలు

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. అమరావతి సెక్రటేరియట్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్ సహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 11న జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న రేట్లపై ప్రధానంగా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం రేట్ల తగ్గింపును లారీ యజమానుల సంఘం తిరస్కరించింది. పాత వాహనాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గరిష్టంగా 25 శాతం లోపే రేట్లు నిర్ణయించాలని సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలు దాటిన వాహనాలు ప్రధానంగా స్వయం ఉపాధి కోసం వినియోగంలో ఉన్నాయని, ప్రస్తుతం వాటిలో కేవలం 10–12 శాతం మాత్రమే రోడ్లపై నడుస్తున్నాయని వివరించారు. విడిభాగాల లభ్యత లేకపోవడం వల్ల పాత వాహనాలు సహజంగానే వినియోగం నుంచి తప్పుకుంటున్నాయని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో అధిక పన్నులు చిన్న లారీ యజమానులకు భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం సూచనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీని వేగవంతం చేయాలని సంఘం కోరగా, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, వాహన్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు, కోశాధికారి నాదెళ్ల కృష్ణ, కేడిఎల్ఓఏ అధ్యక్షుడు నాగమోతు రాజా, ప్రధాన కార్యదర్శి ఏవీవీ సత్యనారాయణ, కార్యదర్శి రావి శరత్ బాబు, కే డి టి ఓ ఏ కార్యదర్శి సూరపనేని సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply