పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యం…

పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యం…

విజయవాడ, ఆంధ్రప్రభ : దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసమే కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 1వ తేదిన పప్పు దినుసులలో ఆత్మనిర్భర్త మిషన్ అనే కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు మంత్రి వివరించారు. పప్పు దినుసులలో ఆత్మనిర్భర్త మిషన్ కింద పప్పుధాన్యాల సేకరణ కోసం వార్షిక లక్ష్యాలు, పప్పు ధాన్యాల సేకరణ, ఆంధ్రప్రదేశ్ కోసం జిల్లాలలో సేకరించిన పప్పుల మొత్తానికి సంబంధించిన వివరాలు కోరుతూ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

కేంద్ర క్యాబినెట్ 2025-26 నుంచి 2030-31 మధ్య ఆరు సంవత్సరాల కాలంలో రూ.11,440 కోట్లతో దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటుగా రైతులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడానికి, రాష్ట్రాలు చేసిన అభ్యర్థనల ఆధారంగా ధర మద్దతు పథకం (ప్రైస్ సపోర్టు స్కీం) నిబంధనల ప్రకారం, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎనఏఎఫఏడి), నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీసీఎఫ్) ద్వారా నమోదిత, ఇష్టపడే రైతులందరి నుండి పప్పు దినుసుల సేకరణకు ఆత్మనిర్భర్త మిషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి భగీరథ్ చౌదరి తెలిపారు.

2025-26లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 101172 మెట్రిక్ టన్నల మేర పప్పు ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నారు. అదే విధంగా గుజరాత్‌లో 88319 మెట్రిక్ టన్నులు, కర్నాటకలో 60508 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలో 118826 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌లో అత్యధికంగా 163311 మెట్రిక్ టన్నులు , తెలంగాణాలో 2549 మెట్రిక్ టన్నలు, ఉత్తర ప్రదేశ్‌లో 68105 మెట్రిక్ టన్నుల మేర పప్పుధాన్యాల ఉత్పత్తి జరిగిందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్‌లో అత్యధికంగా 21575 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగ్గా తరువాత స్థానంలో కర్నూల్ జిల్లా 19449 మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలోనూ, 13837 మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తితో ప్రకాశం జిల్లా మూడో స్థానంలోనూ ఉన్నాయని, మొత్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 1,01,172 మెట్రిక్ టన్నుల మేర పప్పుదినుసుల ఉత్పత్తి జరిగినట్లు వివరించారు.

మిషన్ పప్పు దినుసుల ఉత్పాదకతను పెంపొందించడానికి వాతావరణాన్ని తట్టుకునే విత్తన రకాల ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ విత్తన రకాలు ఫ్రంట్‌లైన్ ప్రదర్శనల ద్వారా రైతులకు లభ్యమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. పప్పుధాన్యల ఉత్పత్తిని పెంచడానికి రైతులకు ప్రత్యేక శిక్షణలు ఆత్మనర్భర్త మిషన్ ద్వారా ఇవ్వడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం సైతం అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.