BC ACT READY : కూటమి బ్రహ్మాస్త్రం Andhra Prabha News

BC ACT READY : కూటమి బ్రహ్మాస్త్రం Andhra Prabha News
- దేశంలోనే తొలి బీపీ రక్షణ చట్టం
- త్వరలోనే ఏపీలో అమలు
- 138 కులాలకు భరోసా
- కులం పేరుతో దూషిస్తే జైలే .
- బీసీ మంత్రులు వెల్లడి
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ )

138 వెనుబడిన తరగతుల కులాల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామని, త్వరలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. బీసీలను కులం పేరుతో గాని, వృత్తి పేరుతో గాని దూషించినా, సాంఘిక బహిష్కరణలకు పాల్పడినా గాని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత నేతృత్వంలో శనివారం నిర్వహించిన బీసీ రక్షణ చట్టం భేటీలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు.
BC ACT READY : హామీలన్నీ అమలు చేస్తున్నాం

బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తున్నామని, ఈ నేపథ్యంలో త్వరలోనే బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నామని తెలిపారు. చట్టం రూప కల్పనకు తుది రూపు ఇవ్వడానికే బీసీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించామన్నారు. ఇది వరకే రెండు పర్యాయాలు బీసీ మంత్రులు సమావేశమయ్యామన్నారు. ఇప్పటికే బీసీ చట్టం ముసాయిదా కూడా సిద్ధం చేశామన్నారు. 138 కులాలకు చెందిన బీసీలను కులం పేరుతోగాని, వృత్తి పేరుతో గాని దూషించినా, సాంఘిక, ఆర్థిక బహిష్కరణలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బీసీల ధన, మాన, ప్రాణాలకు భరోసా కల్పించేలా బీసీ రక్షణ చట్టాన్ని పటిష్టంగా రూపొందిస్తున్నామన్నారు. 15 రకాల వేధింపులకు శిక్షలు రూపొందిస్తున్నామన్నారు. బీసీ మంత్రుల భేటీ వివరాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించామన్నారు.
BC ACT READY : దేశంలోనే తొలుత ఏపీలో అమలు

దేశంనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టం అమలు చేయబోతున్నామన్నారు. బీసీ రక్షణ చట్టం డ్రాఫ్ట్ పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 జోన్లో ఉన్న బీసీ సంఘాలు, ప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. , త్వరలోనే బీసీ రక్షణ చట్టం అమలు చేయనున్నామని స్పష్టం చేశారు. బీసీలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.బీసీలను అన్ని రంగాల్లో ముందు నిలపాలన్నదే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి సవిత తెలిపారు.
BC ACT READY : బీసీల రక్షణే లక్ష్యం

అంతకుముందు నిర్వహించిన భేటీలో బీసీ చట్టం రూప కల్పనలో తీసుకున్న జాగ్రత్తలు, నిపుణులు సూచనలు గురించి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ వివరించారు. కేంద్ర అడ్వకేట్ జనరల్, జాతీయ బీసీ కమిషన్ సలహాలు సూచనలను కూడా ఏపీ బీసీ రక్షణ చట్టం రూపకల్పనలో పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, బీసీ చట్టానికి తుదిరూపు ఇచ్చే క్రమంలో రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలతోనూ చర్చించాలన్నారు. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా బీసీ రక్షణ చట్టం రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు వాసం శెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్య కుమార్ యాదవ్, లా జా యింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.
