నేడు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల…

నేడు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల…
జిల్లాలో అన్నదాతల ఖాతాల్లో రూ. 67.69 కోట్లు జమ..
పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ : అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద మూడో విడతలో అర్హులైన ప్రతిఒక్కరికీ లబ్ధి చేకూర్చడం జరుగుతుందని.. జిల్లాలో ఈ పథకం మూడో విడత కింద రూ. 67.69 కోట్లు లబ్ధిచేకూరుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద ఇప్పుడు మూడో విడతలో 1,18,629 మంది లబ్ధిదారులకు రూ. 4 వేలు చొప్పున రూ. 47.45 కోట్లు లబ్ధి జరుగుతుందని.. అదేవిధంగా పీఎం కిసాన్ కింద 1,01,200 మంది లబ్ధిదారులకు రూ. 2 వేలు చొప్పున రూ. 20.24 కోట్లు జమవుతుందని వివరించారు.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం.. రైతుల ఆర్థిక స్థిరత్వానికి, వ్యవసాయ రంగ బలోపేతానికి దోహదం చేస్తుందన్నారు. రైతులు పంటలు వేసేనాటికి అవసరమైన పెట్టుబడి సాయం అందించడం ద్వారా అన్నదాతల క్షేమం, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. రైతులకు రుణభారం లేకుండా చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు కనీన మద్దతు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోందని వివరించారు.
వ్యవసాయ యోగ్యమైన సొంత భూమి కలిగి ఉన్న రైతు కుటుంబాలకు (భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ), అటవీ హక్కుల గుర్తింపు భూములు సాగు చేస్తున్న రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా సంవత్సరానికి మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 14,000 చొప్పున మొత్తంగా అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ. 20,000 చొప్పున ఆర్ధిక మద్దతు కల్పిస్తున్నట్లు వివరించారు.
ఈ పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిధులను ఖాతాల్లో జమచేసే కార్యక్రమాలు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ జరగనున్నాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
