బాలల భవిష్యత్తుతో ఎవ్వరూ ఆడుకోవద్దు

బాలల భవిష్యత్తుతో ఎవ్వరూ ఆడుకోవద్దు

తొర్రూరు,ఆంధ్రప్రభ : భవిష్యత్తులో బాలలు వివిధ రంగాల్లో సమస్త విషయాల్లో అభివృద్ధి చెందాలంటే దానికి పునాది లాంటి బాల్యదశ ఎంతో ముఖ్యమైనది, అలాంటి విశిష్టత గల బాలల బంగారు భవిష్యత్తుతో విద్యా సంస్థలు గానీ, పోషకులు గానీ, సమాజం గానీ, ఎవ్వరైనా కూడా ఆడుకోవద్దని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ దొనికెన కుమారస్వామి హితవు పలికారు.


ఇటీవల ఆర్యభట్ట స్కూల్ లో జరిగిన సంఘటనపై ఫిర్యాదు, సమస్య పరిష్కార సహాయం కోసం బాధిత విద్యార్థి తల్లిదండ్రులు బుధవారం నాటి సాయంత్రం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని తన నివాసంలో కలిసి వినతి పతనాన్ని అందజేశారు.బాల్య దశలో బాలలకు జరిగిన సంఘటనలు వారిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని, వారి ఎదుగుదలకు ప్రతిబంధకాలుగా మారుతాయని దాంతో పిల్లలు క్రమశిక్షణ తప్పి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.

తద్వారా పిల్లలు అదుపుతప్పి, చెడు అలవాట్లు, ప్రభావాలకు లోనై, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పూనుకుంటారని దాంతో పిల్లల భవిష్యత్తే కాకుండా వారి సంబంధీకులు కూడా సమస్యల్లో చిక్కుకొని, కుటుంబం మొత్తం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయి, తమ జీవితాలనే సర్వనాశనం చేసుకునే అవకాశం ఉంటుందని దొనికెన హెచ్చరించారు.

తెలిసో తెలియకో పిల్లలు విద్యా సంస్థల్లో ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు గానీ, విద్యా సంస్థలు గానీ, ఇరు పక్షాల మద్దతుదారులు గానీ దానిని సమస్యగా మార్చకుండా, దాని గురించి సామరస్యంగా వివరించి, కలిగే పర్యవసానాలు, జరిగే కష్ట నష్టాలు, పడే దుష్ప్రభావాల ఎడల అవగాహన కల్పించి వీలైనంత తొందరలో ఆ సమస్య సద్దుమణిగే విధంగా చూసుకోవాలని దొనికెన సూచించారు.

Leave a Reply