కనకదుర్గమ్మకు కానుక వర్షం..

కనకదుర్గమ్మకు కానుక వర్షం..
- 18 రోజుల వ్యవధిలో భారీ విరాళం
- రూ.3.35 కోట్లకు పైగా నగదు
- బంగారం 302 గ్రాములు, వెండి 3 కిలోలు 10 గ్రాముల కానుకలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను దేవస్థానం అధికారులు లెక్కించారు. ఫిబ్రవరి 21న హుండీ లెక్కింపు అనంతరం నుంచి మార్చి 11 వరకు మొత్తం 18 రోజుల వ్యవధిలో భక్తులు భారీగా కానుకలు సమర్పించారు.
ఈ లెక్కింపులో మొత్తం రూ.3,35,86,637 నగదు దేవస్థానానికి లభించింది. ఇందులో భారతీయ కరెన్సీ నోట్ల రూపంలో రూ.3,20,34,637, నాణేల రూపంలో రూ.15,52,000 వచ్చాయి. సగటున రోజుకు రూ.18,65,924 మేరకు హుండీ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. హుండీ లెక్కింపులో నగదుతో పాటు బంగారం, వెండి కూడా లభించాయి.

మొత్తం 302 గ్రాముల బంగారం, 3 కిలోల 10 గ్రాముల వెండి భక్తులు సమర్పించినట్లు వివరించారు. అలాగే విదేశీ భక్తుల నుంచి కూడా వివిధ దేశాల కరెన్సీలు హుండీలో లభించాయి. అమెరికా డాలర్లు 1337, ఇంగ్లాండ్ డాలర్లు 55, మలేషియా రింగిట్ 10, సింగపూర్ డాలర్లు 132, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ 335, ఆస్ట్రేలియా డాలర్లు 55, కువైట్ దినార్ 60¼, ఖతర్ రియాల్స్ 220, హాంగ్‌కాంగ్ డాలర్లు 20, మౌరిషస్ రూపాయలు 200, కెనడా డాలర్లు 240, సౌదీ రియాల్ 1, బహ్రెయిన్ దినార్ 1, ఫిలిప్పీన్స్ పెసో 100 లభించాయి.

దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హుండీ కార్యక్రమంలో ఏసీ రంగారావుతోపాటు ఏఈఓ లు సూపర్నెంట్లు పాల్గొనగా చైర్మన్ బుర్ర రాధాకృష్ణ ట్రస్ట్ బోర్డు సభ్యులు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు.
