ఇద్దరు అభ్యర్థుల ప్రతిభ..

ఇద్దరు అభ్యర్థుల ప్రతిభ..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి ) శుక్రవారం ప్రకటించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు అభ్యర్థులు ప్రతిభ చాటారు. సిరిగిరాజు పీవీఎస్ సాయి కృష్ణ 125వ ర్యాంకు సాధించగా, ఎం. పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంకు సాధించి జిల్లాకు కీర్తి తెచ్చారు. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన పవన్ కుమార్ రెడ్డి, తండ్రి కృష్ణా రెడ్డి కర్నూలు మండలంలోని పంచలింగాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సిరిగిరాజు పీవీఎస్ సాయి కృష్ణ ప్రస్తుతం నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా విధులు నిర్వహిస్తున్నారు. 2023లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో 42వ ర్యాంకు సాధించి ఎంపీడీవోగా ఎంపికయ్యారు. సాయి కృష్ణ బిట్స్ పిలానీ నుంచి బీటెక్ పూర్తి చేసి సుమారు ఐదేళ్లు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్‌లో ప్రవేశించాలనే లక్ష్యంతో సిద్ధమయ్యారు. పట్టుదలతో చేసిన కృషి ఫలితంగా 2025 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐదో ప్రయత్నంలో 125వ ర్యాంకు సాధించారు. ఈ పరీక్షకు సైకాలజీని ఐచ్చిక విషయంగా ఎంపిక చేసుకున్నారు. తన విజయంపై స్పందించిన సాయి కృష్ణ తల్లిదండ్రులు, భార్య, సోదరి ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం తన విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. వారి మార్గదర్శకత్వం, ప్రోత్సాహం వల్లనే దీర్ఘకాలిక సన్నాహాల్లో దృష్టి నిలుపుకుని విజయాన్ని సాధించగలిగినట్లు పేర్కొన్నారు.
అందరి ప్రోత్సహి వల్లే సాధ్యమైంది..
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కర్నూలు నగరానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి ఆలిండియా స్థాయిలో 297వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటుకున్నారు. గతంలో ఐఆర్ఎస్కు ఎంపికైన ఆయన మూడో ప్రయత్నంలో మరింత మెరుగైన ర్యాంక్ సాధించడం విశేషం. కర్నూలు నగరం ప్రకాష్‌నగర్‌లోని సంకల్‌భాగ్‌కు చెందిన కృష్ణారెడ్డి, మధుమతి దంపతుల కుమారుడైన పవన్ కుమార్ రెడ్డి చిన్ననాటి నుంచే ప్రతిభ కనబరిచారు. ఆయన తండ్రి కృష్ణారెడ్డి కర్నూలు మండలంలోని పంచలింగాల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మధుమతి అదే మండలంలోని ఆర్.కొంతలపాడు పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్)గా సేవలందిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. పవన్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేయగా, కుమార్తె ఎం.చరిత బీటెక్ విద్యను అభ్యసించారు.
పవన్ కుమార్ రెడ్డి కర్నూలు నగరంలోని కేశవరెడ్డి పాఠశాల, శ్రీలక్ష్మి పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి, అనంతరం శ్రీచైతన్య పాఠశాలలో హైస్కూల్ విద్యను అభ్యసించారు. గుంటూరులోని భాష్యం జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. 2016లో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలో 600వ ర్యాంకు సాధించి కర్నూలు మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందారు. 2022లో వైద్య విద్యను పూర్తి చేసి ఎంబీబీఎస్ పట్టా పొందారు. వైద్య విద్య పూర్తయ్యాక సివిల్స్‌పై దృష్టి సారించిన పవన్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందారు.
మొదటి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ పట్టుదలతో మళ్లీ ప్రయత్నించారు. రెండో ప్రయత్నంలో 2025 ఏప్రిల్‌లో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 375వ ర్యాంకు సాధించి ఐఆర్ఎస్ (ఇన్‌కం ట్యాక్స్) అధికారిగా ఎంపికయ్యారు. అయితే అక్కడితో తృప్తి చెందకుండా దీర్ఘకాలిక సెలవులు తీసుకుని మళ్లీ ఢిల్లీలో శిక్షణ కొనసాగిస్తూ మూడో ప్రయత్నంలో 297వ ర్యాంకు సాధించి మరింత మెరుగైన స్థానం సంపాదించారు. ఆయన విజయం కర్నూలు నగరానికి గర్వకారణంగా నిలిచింది.
ఐఏఎస్ సాధిస్తా: పవన్ కుమార్ రెడ్డి
ఐఏఎస్, ఐపీఎస్ సాధించలేకపోయాననే బాధతో ఆగిపోనని పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. మరోసారి గట్టి ప్రయత్నం చేసి సివిల్స్‌లో మరింత మెరుగైన ర్యాంక్ సాధించి ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఐఏఎస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగైన ర్యాంక్ సాధించాను. నా విజయంలో తల్లిదండ్రులు, బంధువులు, గురువుల సహకారం ఎంతో ఉంది. అందరి ఆశీర్వాదంతో మళ్లీ ప్రయత్నించి ఐఏఎస్ సాధిస్తానన్న నమ్మకం ఉంది” అని పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.
