abhishek| ఇంగ్లాండ్‌కు సరైనోడు..
abhishek| ఇంగ్లాండ్‌కు సరైనోడు..
జట్టు నుంచి తప్పించొద్దు..
దినేష్ కార్తీక్, రికీ పాంటింగ్ సూచన
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్ ఇవాళ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రెండో సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. వాంఖడే స్టేడియంలో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్ ఎటాకింగ్ గేమ్ ఆడుతుందా? లేదా ఒత్తిడికి లోనవుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ను ఆడించాలని దినేష్ కార్తీక్, రికీపాంటింగ్ సూచించారు. అతనో భయంకరమైన బ్యాటర్ అని, ఒక్కసారి కుదురుకుంటే తిరుగుండదంటున్నారు. అతనంటే ఇంగ్లండ్ ఆటగాళ్లు వణికిపోతున్నారని, అందుకే తుది జట్టులో నుంచి తీసేయొద్దంటున్నారు.

అభిషేక్ అంటే ఇంగ్లాండ్‌కు భయం : దినేష్ కార్తీక్
“ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలలో జట్టును ఇక్కడివరకు తీసుకువచ్చిన ఆటగాళ్లపై మనం నమ్మకం ఉంచాలి. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో సక్సెస్ కావాలంటే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లనే కొనసాగించాలలని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. గత మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ.. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ జట్టుకు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా.. ఇంగ్లాండ్ బౌలర్లు మాత్రం అభిషేక్ శర్మ పట్ల అప్రమత్తంగా ఉన్నారు. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై అభిషేక్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాదిన విషయాన్ని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ గుర్తు చేసుకున్నాడు. అభిషేక్ ఒక్కసారి క్రీజులో సెట్ అయితే మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చగలడని ఇంగ్లాండ్ శిబిరం భావిస్తోంది.

అతనో మ్యాచ్ విన్నర్.. : పాంటింగ్
ముంబైలో ఇంగ్లాండ్‌తో జరగబోయే సెమీఫైనల్లో అభిషేక్ శర్మను తప్పించకూడదని పాంటింగ్ టీమిండియాను కోరాడు. అభిషేక్ శర్మకు ఇంగ్లాండ్‌పై మంచి రికార్డు ఉందని గుర్తు చేశాడు. గత జనవరిలో ఇదే వాంఖెడే మైదానంలో ఇంగ్లాండ్‌పై శతకం సాధించిన విషయాన్ని పాంటింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సెమీఫైనల్లో అభిషేక్ శర్మ ఏదో ప్రత్యేకంగా చేస్తాడని తనకు నమ్మకం ఉందని, అతడు మ్యాచ్ విన్నర్ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. కచ్చితంగా వాంఖెడేలో దుమ్ము దుమారం రేపుతాడని పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఫామ్‌లో లేనప్పుడు గంటల కొద్దీ నెట్స్‌లో సాధన చేయడం కంటే, మానసికంగా దృఢంగా ఉండటానికి కొద్దిగా విరామం తీసుకోవడం ఉత్తమమని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. “నైపుణ్యాలు ఎక్కడికీ పోవు, బ్యాట్ పక్కన పెట్టి ఫీల్డింగ్ లేదా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు” అని సూచించాడు. అభిషేక్ శర్మ తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడని, సెమీఫైనల్లో అతను కచ్చితంగా రాణిస్తాడని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ అతడిని పక్కన పెట్టాలని భావిస్తే, మరో మ్యాచ్ విన్నర్ రింకు సింగ్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా భారత్ తన బ్యాటింగ్ బలాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నాడు.
