2sides |భార్య-తల్లి మధ్య గొడవ… మగవాడు ఎటువైపు?

2sides | భార్య-తల్లి మధ్య గొడవ… మగవాడు ఎటువైపు?
2sides | మగవాడి మానసిక సంఘర్షణ ఎంత తీవ్రం?
సమస్యను పెంచేది ఎవరు? పరిష్కారం ఎక్కడ?
కుటుంబ శాంతి కాపాడే సమతుల్య వైఖరి
2sides | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మీ అమ్మకీ–మీ ఆవిడకీ మధ్య గొడవ జరిగితే నువ్వు ఎవరి పక్కన ఉంటావు? అని అడిగితే, “ఎవ్వరి పక్కన ఉండను… గోడ పక్కన దాక్కుంటాను” అన్నాడు ఒక ప్రబుద్ధుడు. వినడానికి ఇది సరదా జోక్‌లా అనిపించినా, దాని వెనక ఉన్న మానసిక సంఘర్షణ మాత్రం చాలా తీవ్రం. ప్రతి మగాడి వైవాహిక జీవితంలో తల్లి–భార్య మధ్య సమన్వయం చేయడం ఒక సవాలుతో కూడిన పరీక్ష.
కుటుంబంలో అత్తా–కోడళ్ల మధ్య చిన్న మాటపట్టింపులు సాధారణమే. కానీ అవే కాస్తా ముదిరి భార్యాభర్తల మధ్య పెద్ద వివాదం, కుటుంబ అస్థిరత, మానసిక ఒత్తిడికి దారి తీస్తే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. అప్పుడు మగవాడు ఎటువైపు ఉండాలి? తల్లి వైపా? భార్య వైపా? లేక మధ్యవర్తిగా నిలవాలా? అనే ప్రశ్న అతన్ని లోలోపల గిలిగింతలు పెట్టే సందేహంగా మారుతుంది.
ఒకవైపు తనను జన్మనిచ్చి పెంచిన తల్లి. మరోవైపు జీవితాంతం తోడుగా ఉండే భార్య. ఇద్దరూ అతని జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తులు. ఒకరి మాట వింటే మరొకరికి అసంతృప్తి, కోపం. ఇదే అసలు భావోద్వేగ దిలేమా.
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం “ఎటువైపు?” అనే ప్రశ్న కంటే “ఎలా వ్యవహరించాలి?” అనే ప్రశ్న ముఖ్యమని చెబుతున్నారు. మగవాడు ఒకరిని గెలిపించి, మరొకరిని ఓడించాల్సిన అవసరం లేదు. అతను చేయాల్సింది—పరిస్థితిని అర్థం చేసుకుని ఇద్దరికీ సమంగా, న్యాయంగా వ్యవహరించడం. ఇది వినడానికి సులభంగా అనిపించినా, వాస్తవంలో ఇది ఒక పరిపక్వత పరీక్ష.

ఎందుకంటే ఇద్దరివీ వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు వయసులు, వేర్వేరు మనస్తత్వాలు. వారిద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్ అతడొక్కడే. అందుకే మొదటగా ఇద్దరి మాటలు ఓపికగా, శాంతంగా వినాలి. ఆవేశంగా స్పందిస్తే చిన్న సమస్య కూడా పెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది.
వ్యక్తిగత విషయాలను బయటవాళ్ల ముందు చర్చించడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. అత్తా–కోడళ్ల మధ్య సమస్య చిన్నదే అయితే అది కాస్తా పెద్దది కాకముందే పరిష్కరించడం ఉత్తమం. లేకపోతే అది భార్యాభర్తల మధ్య భావోద్వేగ దూరం పెంచే ప్రమాదం ఉంది.
భార్యకు తనకు అండగా ఉన్నాడనే భరోసా అవసరం. తల్లికి తన గౌరవం తగ్గలేదనే ఆత్మవిశ్వాసం కలగాలి. తాను ఎవరిపక్షపాతి కాదనే స్పష్టమైన నమ్మకం ఇద్దరికీ కలిగించాలి. ఇదే ఒక కుటుంబాన్ని నిలబెట్టే పవర్ ఫుల్ సూత్రం.
వారిద్దరి గురించి ఒకరికి మరొకరు చెడు మాటలు చెప్పకూడదు. అత్తా–కోడళ్ల మధ్య స్నేహభావం, పరస్పర గౌరవం, సామరస్యం కుటుంబానికి బలమైన పునాది అని గుర్తు చేయాలి.
నిజానికి ఈ సమస్య పరిష్కారం ఒక్కరి చేతుల్లో ఉండదు. తల్లి, భార్య, భర్త ముగ్గురి సహకారం అవసరం. అయితే మధ్యలో ఉన్న భర్త సానుకూలంగా, సమతుల్యంగా, పరిపక్వంగా వ్యవహరిస్తే సమస్యలు త్వరగా సద్దుమణుగుతాయి. అతని సామరస్య వైఖరి కుటుంబాన్ని కాపాడే అత్యంత కీలక శక్తి.

చివరగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే—కుటుంబం అనేది గెలుపోటముల రంగస్థలం కాదు. అది పరస్పర అవగాహన, గౌరవం, ప్రేమలపై నిలిచే బలమైన బంధం. భార్య–తల్లి మధ్య గొడవ వచ్చినప్పుడు ఎటువైపు ఉండాలి అని కాకుండా, ఇద్దరినీ ఎలా కలిపి ఉంచాలి అనే దానిపై దృష్టి పెట్టడం నిజమైన పరిపక్వత.
యస్. నాగమణి,
సీనియర్ జర్నలిస్ట్,
పారా లీగల్ వాలంటీర్ (PLV)
