నల్ల నల్లితో రైతులు కుదేల్…

నల్ల నల్లితో రైతులు కుదేల్…
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : నిన్న మొన్నటి వరకు నల్లనల్లి, తెల్ల తామర వైరస్ మిర్చి ఇతర అంతర్ పంటలపై సోకి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.ఇప్పుడు ఎ.కొండూరు మండల ప్రాంతంలో ఉన్న మామిడి తోటలపై ఈ వైరస్ ముప్పేట దాడి చేస్తుందని రైతులు వాపోతున్నారు. ఈ నల్ల నల్లి తామర మామిడి తోటల్లో పూతలపై చేరి పత్ర హరితాన్ని పీల్చి పూత పిందె దశలోనే మామిడి రైతులను కుదేల్ చేస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు మామిడి తోటలకు 10 నుండి 15 సార్లు మందులు పిచికారి చేశారంటే మామిడి తోటలకు చేరిన వైరస్ ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
గత రెండు సంవత్సరాల నుండి మామిడి తోటలపై దాడి చేస్తున్న ఈ వైరస్ తో తీవ్రంగా నష్టపోయామని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటికి తోడుగా కొత్తగా తెల్ల తామర కూడా చేరి మామిడి రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందన్నారు. ఈ వైరస్ నివారణ కు మామిడి రైతులు వ్యాపారస్తులు ఇప్పటికే పై మందులకు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మామిడి తోటలు సాగు చేస్తున్నారని,కానీ పంట చేతికి అంది వచ్చే సమయానికి ఇలాంటి వైరస్ లతో మామిడి సాగు అంటేనే భయం వేస్తుందని రైతులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తోటలకు మందులు పిచికారి చేస్తున్న కూలీలకు ఈ వైరస్ ఒంటి మీద పడినప్పుడు కళ్ళు మంటలు చర్మంపై దద్దుర్లు వస్తున్నాయని కనీసం మందులు పిచికారి చేయడానికి కూలీలు కూడా రావడంలేదని మామిడి రైతులు తెలిపి వాపోయారు. భవిష్యత్తు రోజుల్లో మామిడి తోటలు సాగు చేయడం కష్టతరం అవుతుందని రైతులు అంటున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అయినా మామిడి దిగుబడి బాగుంటుందనుకున్న తరుణంలో నల్ల నల్లి మామిడి పంటను నాశనం చేసిందని రైతులు వాపోతున్నారు.
నల్లనల్లి నివారణకు ఎన్ని మందులు పిచికారి చేసిననా ఫలితం శూన్యమని ఇప్పటికైనా ఉద్యాన శాఖాధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని మండల ప్రాంత మామిడి రైతులు కోరుతున్నారు.
