అంగన్ వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం…

అంగన్ వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం…

మైలవరం ఎమ్మెల్యే వసంత

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానికీ, చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.86.68 లక్షలు విడుదల చేసి, ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. అంగన్వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టిందన్నారు.

58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్ వైజర్లు, బ్లాక్ కో – ఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5జీ స్మార్ట్ ఫోన్లు అందించిందని వివరించారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల హాజరు 70 శాతం నుంచి 96 శాతానికి పెరగడం కూటమి పాలనకు వచ్చిన ప్రత్యక్ష ఫలితమన్నారు. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ కలను కూటమి ప్రభుత్వం నిజం చేసిందని చెప్పారు. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లోనే రూ.20 కోట్లు కేటాయించి, అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచిందన్నారు.అంగన్వాడీ సెంటర్ కు టీవీ, ఆర్వోలు, టాయిలెట్ సౌకర్యం, టీచర్లు, ఆయాలకు వేసవిలో 15 రోజులు సెలవులు, ఆటవస్తువులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్టులు, ఇండక్షన్ స్టవ్, నాణ్యమైన వంటపాత్రలు ఇచ్చామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్ గా పదోన్నతి కల్పించి, పూర్తి స్థాయి వేతనాలు అందించనుందన్నారు. అలాగే కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనుందని తెలిపారు. అంగన్వాడీలు ప్రతిపాదించిన డిమాండ్లలో 9 డిమాండ్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తూ, ఉద్యోగులకు భరోసాగా నిలుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దివాళా తీసి వెళ్ళిందని విమర్శించారు. వారు చేసిన అప్పులకు రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు ఇంకా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply