దార్శనికతకు అనుగుణంగా ఎన్‌హెచ్-65 విస్తరణ..

దార్శనికతకు అనుగుణంగా ఎన్‌హెచ్-65 విస్తరణ..
భవిష్యత్తు అవసరాల మేరకు రహదారి అభివృద్ధి
విజయవాడ నగర రద్దీకి అనుగుణంగా పై వంతెనలు
నవ్య రాజధానికి అనుసంధానంగా ఎన్‌హెచ్ నెట్వర్క్
ఎన్‌హెచ్ ప్రాజెక్టులపై భాగస్వాముల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ,ఆంధ్రప్రభః రాష్ట్ర నవ్య రాజధాని అమరావతి, విజయవాడ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం ముఖ్యమని.. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్-65 విస్తరణ ఉండాలని కోరుకుంటున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై భాగస్వాముల (స్టేక్‌హోల్డర్స్) సమావేశం జరిగింది.
జాతీయ రహదారులు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్‌తో పాటు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు బోడె ప్రసాద్, వసంత వెంకట కృష్ణప్రసాద్, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, గద్దె రామ్మెహన్‌రావు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే-65 ఆరు వరుసల విస్తరణకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. విస్తృత ప్రజాప్రయోజనాలతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేపట్టాల్సి ఉందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రైతుల ప్రయోజనాలకు ఇబ్బందిలేకుండా పనులు జరగాల్సి ఉందన్నారు.
సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో పాటు గౌరవ ప్రజాప్రతినిధులు కూడా సమావేశానికి హాజరై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్ 65 విస్తరణకు సంబంధించి కొంతవరకు డీపీఆర్ తయారైందని.. ఈ డీపీఆర్‌ను పరిశీలించిన మీదట ఎక్కువమంది రైతులు ఇబ్బందిపడే అవకాశమున్నందున విస్తరణలో ప్రతిపాదించిన రెండు బైపాసులు (అంబారిపేట-ఐతవరం; కాచవరం-మూలపాడు-ఇబ్రహీంపట్నం వెస్ట్) బదులు పాత రహదారినే పటిష్ట ప్రణాళికతో విస్తరణతో అభివృద్ధి చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు.
సూర్యాపేట, నకిరేకల్ తరహాలో ఎక్కడైనా ఊర్ల గుండా వెళితే ఆయా ప్రాంతాల్లో పై వంతెనలు వేస్తూ పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారి ఫ్లై ఓవర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు అదేవిధంగా బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఆరు వరుసల ఫ్లై ఓవర్లు వేయాల్సి ఉందన్నారు. నగరంలోని అమెరికన్ హాస్పిటల్, వైవీ రావు హాస్పిటల్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఎన్‌హెచ్‌ను ఎంజీ రోడ్డుకు అనుసంధానించడం కూడా ముఖ్యమన్నారు. గొల్లపూడి-జక్కంపూడి కాలనీ వరకు ఉన్న హైవే రోడ్డుకు సంబంధించి 3.5 కి.మీ. మేర స్లిప్ రోడ్డు ఇవ్వమని కోరుతున్నామని.. దీనివల్ల ఎన్‌హెచ్ 16, ఎన్‌హెచ్ 65, నాగపూర్ హైవేలకు అనుసంధానానికి దోహదం చేస్తుందని వివరించారు. ఎన్‌హెచ్ 65, ఎన్‌హెచ్ 16 కలిసే చోట ఒక క్లోవర్ లీఫ్ అవసరమని పేర్కొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో నివేదికను ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆర్ అండ్ బీ కార్యదర్శి, నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. రాబోయే కాలంలో చక్కటి జాతీయ రహదారుల నెట్వర్క్ ఉండేలా చొరవ చూపనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
సమావేశంలో ఎన్‌హెచ్ పీడీ (విజయవాడ) ఎం.విద్యాసాగర్, ఎన్‌హెచ్ పీడీ (హైదరాబాద్) సీహెచ్ శ్రీనివాసరావు, పీడీ (అమరావతి) టి.పార్వతీశం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
