Minister | రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్

Minister | రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్
- వైద్య కళాశాల విద్యార్థుల ఏసి బస్సులు
- నల్గొండ మెడికల్ కళాశాలను ఉత్తమంగా తీర్చిదిద్దుతాం
- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : 900 కోట్ల రూపాయలతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో నల్గొండను స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. డాక్టర్లు తెల్ల కోటుకు పరిమితం కాకుండా, మానవతా దృక్పథంతో పేదలకు వైద్య సేవలందించాలన్నారు. ఈ రోజు (గురువారం) నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో “అద్వితీ -2026” పేరున నిర్వహించిన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయబడిందని, విద్యార్థులు సబ్జెక్టులతో పాటు, మానవత్వాన్ని కూడా నేర్చుకోవాలని, తెల్ల కోటు బాధ్యతకు “సింబల్ ”అని అన్నారు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తీర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వైద్య కళాశాల విద్యార్థుల కోసం రెండు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నెలలోపు వీటిని మంజూరు చేస్తామన్నారు.
నల్గొండ పట్టణంలో వైద్య విద్యనే కాకుండా, చదువుకోసం ప్రతి పేద విద్యార్థికి సహకారం అందిస్తామని, ఇందుకు తమను సంప్రదించాలని, విద్యాభివృద్ధిలో భాగంగా బొట్టుగూడా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను, అలాగే ప్రతిక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని , పట్టణంలోని మరికొన్ని పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని, 900 కోట్ల రూపాయలతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో నల్గొండను స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా చేస్తామని తెలిపారు.
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాలలో పేద ప్రజలకు సేవలు అందించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ వత్తి పవిత్రమైందని, రోగులను చిరునవ్వుతో పలకరించి వారికి వైద్యం చేయాలని సూచించారు. డిప్యూటీ మేయర్ అమీర్ ఆశ్రఫ్ అలీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి ,డాక్టర్లు ఆయా వైద్య విభాగాల అధిపతులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
