షాంపూర్ వంతెనపై బస్సు ప్రమాదం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని షాంపూర్ సమీప వంతెనపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి మానవ తప్పిదాలే కారణమని లంబాడ జేఏసీ ఆదిలాబాద్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి భాను జగన్ నాయక్ ఆరోపించారు. అసిఫాబాద్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఆదిలాబాద్ నుంచి అసిఫాబాద్‌కు వెళుతుండగా వంతెనపై బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద స్థలాన్ని మంగళవారం లంబాడ జేఏసీ నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా భాను జగన్ నాయక్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు నెట్‌వర్క్ రాందాస్ నాయక్, మండల మాజీ వైస్ ఎంపీపీ దావుల బాలాజీ, మాజీ ఎంపీటీసీ కందుకూరి రమేష్, నాయకులు కాటం రమేష్ తదితరులు మాట్లాడుతూ షాంపూర్ వాగుపై ఉన్న ఇరుకు వంతెన కారణంగా గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయని, ప్రాణనష్టాలు సంభవించాయని పేర్కొన్నారు. మరోసారి బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించి బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా షాంపూర్ వాగుపై ఉన్న వంతెనను వెడల్పు చేసి, ఎత్తు పెంచాలని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని, సాధన కమిటీని ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్, జన్నారం వైపు భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నందున చిన్న వంతెనలు, బిడ్జిలా వంతెనల మరమ్మతులు కూడా వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply