చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

కుమ్మెర మల్లన్న ఆలయంలో మృతి చెందిన చిన్నారికి న్యాయం చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభః నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలోని మల్లన్న దేవస్థానం వద్ద గొడవ కారణంగా మూడేళ్ళ చిన్నారి మృతి చెందిన సంఘటనలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు ఆదివారం నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాయి. వీరికి మద్దతుగా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు కార్య కర్తలతో రోడ్డుపై బైఠాయించారు.


సంఘటనపై స్పందించిన పలు సంఘాలు రెండు రోజుల నుంచి ఆందోళన బాట పట్టగా ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వివిధ ప్రజా సంఘాలు డీఎస్పీని కలిశారు. కొట్టిన అగ్ర వర్ణాలపై కాకుండా బాధితులపై కేసు నమోదు చేయడాన్ని నిలదీశారు. పాప మృతుకి కారకులపై హత్య కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. అంత మంది అగ్రవర్ణాలు కలిసి గణేష్ ను చితకబాదినా వారిపై కేసు నమోదు చేయకపోడం అగ్ర వర్ణాల వారికీ వత్తాసు పలకడమేనన్నారు.

తక్షణమే మృతి చెందిన 3నెలల పాప తల్లి మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలనీ వారు డిమాండు చేశారు. సంఘటనపై పూర్తి విచారణ చేపట్టి రెండు రోజుల్లో సంఘటనకు బాధ్యులపై కేసు నమోదు చేస్తానని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చినా సంతృప్తి చెందని నాయకులు అక్కడే పోలీసు స్టేషన్ ముందు రాస్తారోకో చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించబోమని కరాఖండిగా చెప్పారు.

బధ్యులైన 8 మందిని అరెస్టు చేయాలనీ, పాప మృతికి కారకులైన వారిపై హత్య కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. రాస్తారోకో అనంతరం కుమ్మెర గ్రామానికి బయలుదేరి వెళ్లారు. గ్రామంలో వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబాదు సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు రామయ్య డిఎస్పి జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్ పృథ్వీరాజ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ టిఆర్ఎస్ డీఎస్పీ సిపిఎం ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని నిరసన నిర్వహించారు

Leave a Reply