Re cycling | వ్య‌ర్థాల ఉత్ప‌త్తిని త‌గ్గించాలి…

Re cycling | వ్య‌ర్థాల ఉత్ప‌త్తిని త‌గ్గించాలి…

  • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం
  • జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Re cycling | కర్నూలు ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రతి ఒక్కరూ ‘జీరో-వ్యర్థాల జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో “జీరో లిట్టర్ గవర్నెన్స్” అనే థీమ్ తో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. తొలుత కలెక్టరేట్ నుండి అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా “జీరో లిట్టర్ గవర్నెన్స్” అనే థీమ్ తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన వాతావరణం సాధ్యమని, ప్రతి ఒక్కరూ ‘జీరో-వేస్ట్’ జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ కోరారు. వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించాలని, రీ సైక్లింగ్, తిరిగి ఉపయోగించడం లాంటి పద్ధతుల ద్వారా పర్యావరణ ప్రయోజనం కలుగుతుందన్నారు.

ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించి తమ వంతు సహకారం అందించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణ హిత వస్తువులనే వాడాలన్నారు. డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, అదే విధంగా డీ-సిల్టేషన్ పనులు చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ పారిశుధ్య కార్మికులను ఆదేశించారు. ఈ సారి సుమారు 40 నుండి 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.

ఇప్పటికే ఉన్న పాత చెత్తను (legacy waste) తొలగించడంతో పాటు, కొత్తగా చేరే ఘన మరియు ద్రవ వ్యర్థాలను శుద్ధి చేయడానికి వివిధ దశల్లో టెండర్లు ప్రక్రియలు జరుగుతున్నాయన్నారు. అక్కడే ఉన్న పారిశుధ్య కార్మికులతో కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఖచ్చితంగా గ్లౌస్ లు, మాస్క్ లు ధరించాలని కలెక్టర్ సూచించారు… పనిముట్లు ఇస్తున్నారా? లేదా ? సరైన సమయానికి జీతం వస్తుందా? లేదా? అని కలెక్టర్ పారిశుధ్య కార్మికులను ఆరా తీశారు. పారిశుధ్య కార్మికులు పోషకాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ పారిశుధ్య కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో డిపిఓ భాస్కర్, కలెక్టరేట్ ఏఓ శివరాముడు, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply