గీతా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం గీతా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని గౌడ సంఘం నారాయణపేట జిల్లా కన్వీనర్ బిజ్వార్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం జనగామ జిల్లాను పాపన్న గౌడ్ జిల్లాగా మార్చాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రమాద భీమాలను వెంటనే విడుదల చేయాలని,కల్లుగీత కార్పోరేషన్ కు నియమించిన 500 కోట్లు విడుదల చేసి కల్లుగీత కార్మికులను ఆదుకోవాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేసి అందులో గౌడ కులస్తులను దామాషా ప్రకారం అవకాశం ఇవ్వాలని, గ్రామాలలో ఐదు నుండి పది ఎకరాల్లో తాటి,ఈత చెట్ల పెంపకానికి భూమిని పంపిణీ చేయాలని, గీత కార్మికులకు ప్రమాద బీమా కోసం మెడికల్ విధానాన్ని వెంటనే రద్దు చేసి మృతి చెందిన గౌడ కులస్తులకు 10 లక్షల ప్రమాద బీమాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు రూ 5000 పెన్షన్ ఇవ్వాలని,రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న టి.సి.ఎస్,టి.ఎఫ్.టి లైసెన్సులను వెంటనే ఇవ్వాలని,ఏజెన్సీ గీత గౌడ కులస్తులను ఎస్టీలుగా గుర్తించి వారి లైసెన్స్ లను వెంటనే రెన్యువల్ చేయాలని,పెండింగ్ లో ఉన్న కార్డులు విడుదల చేయాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో గౌడ సంఘం నాయకులు నారాయణ గౌడ్,రవి గౌడ్, సురేంద్ర గౌడ్,వెంకప్ప గౌడ్,నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.