AP NGO | మహిళా ఉద్యోగుల్లో మనోధైర్యానికి భ‌రోసా…

AP NGO | మహిళా ఉద్యోగుల్లో మనోధైర్యానికి భ‌రోసా…

  • వారి సమస్యల పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యత..
  • ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్

AP NGO | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మనోధైర్యం స‌డ‌ల‌కుండా భ‌రోసా కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ తెలిపారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వ‌హించ‌నున్న మహిళా దినోత్సవ ప్ర‌త్యేక కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం ఎన్జీవో హోంలో విద్యాసాగ‌ర్ ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ… మహిళలు లేనిదే సమాజానికి మనుగడ లేదని అన్నారు. మహిళా ఉద్యోగుల కృషి, నాయకత్వం, ప్రతిభ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం, సురక్షితమైన పని వాతావరణం కల్పించడం అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్నే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నామని చెప్పారు.

AP NGO |

మహిళా ఉద్యోగులకు సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్‌పై ఉన్న వయోపరిమితిని తొలగించి అర్హులైన ఉద్యోగులకు వర్తింపజేసేలా ఉత్తర్వులు జారీ చేయించామని తెలిపారు. అలాగే మెడికల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల క్యాజువల్ లీవ్ వర్తింపజేసేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించి మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేయ‌నున్న‌ట్లు ఆయన తెలిపారు.

AP NGO |

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం చైర్‌పర్సన్ వి.నిర్మలా కుమారి మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 4, 5, 6 తేదీలలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 4వ తేదీన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా పోటీలు, 5వ తేదీన దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

AP NGO |

6వ తేదీన ధీనగర్‌లోని ఎన్జీవో హోంలో పాటలు, నృత్య పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తామని చెప్పారు. మార్చి 9వ తేదీన రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలను సన్మానించడం తో పాటు విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ, రాష్ట్ర మహిళా విభాగం కార్య‌వ‌ర్గ స‌భ్యులు పి.మాధవి, కె.శివలీల, కె. సరస్వతి, ఎస్. దీప్తి, బి. శాంతిశ్రీ, పి. సురేఖ, తులసి రత్నం, బి.హెచ్. నాగమల్లేశ్వరి, బి. విజయశ్రీ, సి.హెచ్. శ్రీదేవి, బి. శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply