SAAP Leagues : జాతి రత్నాల వేట Andhra Prabha Sports News

SAAP Leagues : జాతి రత్నాల వేట Andhra Prabha Sports News
ఊరూరా శాప్ లీగ్స్
ఏడాది పొడవునా పోటీలే పోటీలు
క్రీడా రంగంలో కొత్త మలుపు
26 జిల్లాలు.. 31 క్రీడలు…
గ్రామీణ ప్రతిభకు రాష్ట్రస్థాయి వేదిక
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో)
SAAP Leagues : ఏపీలోని మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి, వారికి రాష్ట్రం నుంచీ జాతీయ స్థాయివరకు ఎదిగే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘శాప్ లీగ్స్’ కార్యక్రమాన్ని అమలు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ చేస్తోంది. ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన క్రీడా అవకాశాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ ప్రణాళిక, రాష్ట్ర క్రీడా రంగానికి ఒక కొత్త దశకు నాంది పలికేలా శాప్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 28 వరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 31 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించేందుకు పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఏడాది పొడవునా కొనసాగే ఈ లీగ్స్ ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులు ప్రత్యక్షంగా పోటీ వాతావరణంలోకి రావడం ద్వారా, రాష్ట్రానికి భవిష్యత్తు క్రీడా సంపదను తయారు చేసే వేదికగా శాప్ లీగ్స్ మారనుంది.
SAAP Leagues : నైపుణ్యాలు వెలికి తీసే ప్రయత్నం..

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే శాప్ లీగ్స్‌లో క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం. ఎంపిక ప్రక్రియ పూర్తిగా జిల్లా స్థాయిలోనే జరగడం. ప్రతి జిల్లాలో ముందుగా టోర్నమెంట్లు నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన వారినే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఒక జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుడు తప్పనిసరిగా అదే జిల్లాకు చెందినవాడై ఉండాలనే నిబంధన పెట్టడం వల్ల, బయటి ప్రాంతాల ఆధిపత్యానికి తావు లేకుండా స్థానిక యువతకే ప్రధాన అవకాశాలు లభించనున్నాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగపడే విధానం. ఇప్పటివరకు పెద్ద నగరాల నుంచి వచ్చిన క్రీడాకారులే ఎక్కువగా రాష్ట్ర జట్లలో చోటు దక్కించుకునే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ప్రతి జిల్లా నుంచీ నిజమైన ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి.
SAAP Leagues : క్రీడాకారులకు సరికొత్త ఉతం..

శాప్ లీగ్స్ కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా, క్రీడలను ఒక స్థిరమైన ఉపాధి మార్గంగా మార్చే లక్ష్యంతో రూపొందించబడింది. లీగ్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు భవిష్యత్తులో రాష్ట్ర జట్లలో చోటు, జాతీయ పోటీలకు ఎంపిక, స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు, ప్రత్యేక శిక్షణ శిబిరాలు వంటి ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో పేద కుటుంబాల యువత కూడా క్రీడలనే జీవిత లక్ష్యంగా ఎంచుకునే ధైర్యం పొందే పరిస్థితి ఏర్పడుతోంది. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు భద్రమనే నమ్మకాన్ని శాప్ లీగ్స్ మరింత బలాన్ని చేకూరుస్తుంది.
SAAP Leagues : 31 క్రీడాంశాల్లో పోటీలు..

శాప్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేఈ లీగ్స్‌లో సైక్లింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, వాటర్ స్పోర్ట్స్, ఆర్చరీ, ఫుట్‌బాల్, బీచ్ వాలీబాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, పారా స్పోర్ట్స్, బీచ్ క్రీడలు, బాస్కెట్‌బాల్ వంటి మొత్తం 31 క్రీడాంశాలు ఉన్నాయి. ఒలింపిక్ స్థాయి క్రీడలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆడే సంప్రదాయ క్రీడలకు కూడా చోటు కల్పించడం విశేషం. అన్ని క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి క్రీడాకారులలో ఉన్న నైపుణ్యాన్ని ప్రతిభను వెలికి తీసి వారికి సంపూర్ణ గౌరవం కల్పించే లక్ష్యంతో శాప్ ఈ క్యాలెండర్ ను రూపొందించింది. దీంతో ఒకే వేదికపై వివిధ రకాల క్రీడాకారులు పోటీ పడే అవకాశం ఏర్పడింది. ఇది రాష్ట్ర క్రీడా సంస్కృతిని మరింత విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది.
SAAP Leagues : ఎంపిక జరిగేది ఇలా…

శాప్ లీగ్స్‌లో పాల్గొనదలచిన అర్హత గల క్రీడాకారులు క్రీడాయాప్ ద్వారా లేదా సంబంధిత డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వయోపరిమితి ఆయా క్రీడాంశాల నిబంధనల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ మొత్తం జిల్లా స్థాయి నుండే ప్రారంభమవుతుంది జిల్లాస్థాయిలో టోర్నమెంట్ నిర్వహించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు జిల్లాకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుడు కచ్చితంగా జిల్లా వాసవి ఉండాలి పోటీలు రాష్ట్రస్థాయిలో జరుగుతాయి వయోపరిమితి ఆయా క్రీడాంశాల మీద ఆధారపడి ఉంటుంది.
క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం..

శాప్ లీగ్స్ అనేది కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదు. గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం. రాష్ట్రానికి భవిష్యత్తు క్రీడాకారులను తయారు చేసే శిక్షణా పాఠశాల.క్రీడలను వినోదం నుంచి వృత్తిగా మార్చే ప్రభుత్వ వ్యూహం.
ఏ రవి నాయుడు , . చైర్మన్ , ఆంధ్రప్రదేశ్ క్రీడ ప్రాధికారిక సంస్థ
