నేటి నుంచి ఏపీ లో శనగల కొనుగోళ్లు షురూ

15 రోజుల లోపు రైతులకు నగదు చెల్లింపులు

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి

అమరావతి, ఫిబ్రవరి 17: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతితో రబి సీజన్ 2025-26 లో పండించిన శనగలను NAFED, NCCFల ద్వారా 94,500 మెట్రిక్ టన్నుల శెనగల కొనుగోళ్లకు ధర మద్దతు పథకం (PSS) అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి మంగళవారం ఆదేశాలు అందాయని, నేటి నుంచి CM APP ద్వారా అన్ని జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఉన్న DLPCలు కొనుగోళ్లను పర్యవేక్షిస్తాయని, అవసరమైన మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసినట్లు పేర్కొన్నారు.

వ్యవసాయం, ఉద్యానవనం, లీగల్ మెట్రాలజీ, మార్కెటింగ్, ఏపీ మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైస్ తదితర శాఖల సమన్వయంతో రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. PACS, FPOలు, స్వయం సహాయక సంఘాలు వంటి విశ్వసనీయ ఉప-ఏజెన్సీలను రంగంలోకి దింపి పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సీజన్‌లో సుమారు 3.25 లక్షల హెక్టార్లలో శనగల సాగు జరిగిందని, దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉన్నట్లు మంత్రి వివరించారు.

రైతులు తమ ఉత్పత్తిని సమీప RSKలలో నమోదు చేసుకోవాలని, CM APP ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామని తెలిపారు. కొనుగోలు చేసిన శనగలను CWC/SWC గోదాముల్లో నిల్వ చేస్తామని, రైతులకు చెల్లింపులు 15 రోజుల లోపు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply