Star Pratyusha Case : సుప్రీం తీర్పు ఓకే Andhra Prabha Analysis

Star Pratyusha Case : సుప్రీం తీర్పు ఓకే Andhra Prabha Analysis
దోషి జైలుకు వెళ్తాడా? లేదా?
ప్రత్యూష కేసులో మరో కథ
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
యావత్తు భారతావనిలో సంచలనం రేపిన టాలీవుడ్ దృవతార ప్రత్యూష ఆత్మహత్య కథ 24 ఏళ్లకు కంచికి చేరింది. ఎట్టకేలకు భారత సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును ప్రకటించింది. ఈ కేసులో గుడిపల్లి సిద్ధార్థ రెడ్డిని దోషిగా నిర్ధారించింది. ప్రత్యూష కేసులో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. గత 24 ఏళ్లుగా బెయిల్ పై స్వేచ్ఛాజీవితం గడుతూ బ్రిటన్ లో బిజినెస్ టైకూన్ గా అవతరించిన సిద్ధార్థ రెడ్డి .. సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటికీ మళ్లీ బెయిల్ కోసం ప్రయత్నం చేశాడు. కానీ సుప్రీం కోర్టు అతడి బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. ఇక దోషికి తగిన శిక్ష పడలేదని ప్రత్యూష తల్లి సరోజినీ దేవీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరే.. ఓ వర్ధమాన నటి అర్ధంతర మరణం వెనుక మిస్టరీలో అసలు నిజాలపై సభ్య సమాజంలో అనేక అనుమానాలు పీడిస్తునా.. న్యాయవ్యవస్థకు సనైన సాక్ష్యాధారాలు ఇప్పటికీ లభించలేదని జనం భావిస్తున్నారు.

Star Pratyusha Case : ఈ ఘటన జరిగిన తీరు, పోలీసుల విచారణ, కోర్టుకు అందిన సాక్ష్యాలు.. ధర్మాసనం తీర్పును సైతం ప్రశ్నించి,, బెయిల్ బురఖాలో 24 ఏళ్లు తప్పించుకుని బ్రిటిన్ తిరిగిన దోషి సిద్ధార్థ రెడ్డికి ఎట్టకేలకు జైలుగోడల్లో చిప్పకూడు తప్పలేదు, అని ప్రత్యూష అభిమానులు భావిస్తున్నారు. ధర్మాసపం ఆదేశం మేరకు నాలుగు వారాల్లో.. అంటే 2026 మార్చి 20వ తేదీలోపు చర్లపల్లి జైలుకు వెళ్లాలి. గతంలో అనుభవించిన శిక్షను మినహాయిస్తే .. మిగిలిన కాలం జైలు పక్షిగా కాలం గడపాల్సిందే. కానీ ఇక్కడే మరో తిరకాసు ప్రశ్న వినిపిస్తోంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, వజ్రాల దిగ్గజం నీరబ్ మోడీ స్థాయి లేదు.. కానీ ఇతడూ వ్యాపారస్థుడే. సుదీర్ఘకాలం లండన్ లోనే స్థిరపడ్డాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాడు. బెయిల్ పేరిట.. కోర్టు కేసు విచారణలకూ హాజరు కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్సునకు తలవంచుతాడా? ఒకవేళ ఇండియాకు రాకపోతే పరిస్థితి ఏమిటీ? ఇంకేముందీ, అతడిపై భారతీయ పోలీసులు నాన్ -బైలబుల్ వారెంట్ జారీ చేసే పనిలో నిమగ్నమవుతారు.

Star Pratyusha Case : అప్పటికీ లెక్కచేయక పోతే, భారత్, బ్రిటన్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం బ్రిటిష్ అధికారుల సహాయంతో అతడిని ఇండియాకు రప్పించే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు సాగుతుందో.. అంచనా కష్టం. మరో ఐదారేళ్లు పట్టినా పట్టవచ్చు. భారత ప్రభుత్వం మాత్రం గట్టిగా పట్టుబట్టి ఇండియాకు తీసుకు వచ్చి కోర్టు ధిక్కారణ కేసులో అరెస్టు చేస్తే.. ఈ రెండేళ్ల శిక్ష మరికొంత కాలం పెరుగుతుంది. ఇంతకీ సిద్ధార్థ రెడ్డి జైలుకు వెళ్తాడా? కాలాయాపన చేస్తాడా? అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే..
Star Pratyusha Case : ఈ ప్రత్యూష ఎవరు?
ప్రత్యూష స్వస్థలం తెలంగాణలోని భువనగిరి. ఆమె కుటుంబం ఇక్కడే స్థిరపడింది.ఆమె తల్లి సరోజినీ దేవి. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ప్రత్యూష తండ్రి ఆమె చిన్నతనంలోనే మరణించారు. ప్రత్యూషను, ఆమె తమ్ముడు ప్రణీత్ కృష్ణను పెంచి పెద్ద చేశారు.తండ్రి లేని లోటు తెలియకుండా ప్రత్యూష తన తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకుంది, భువనగిరిలోని సంతోష్ విద్యా నికేతన్ , మిర్యాలగూడలోని ప్రకాష్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను ప్రత్యూష అభ్యసించింది. అనంతరం హైదరాబాద్‌లోని తార్నాక సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఎస్.ఆర్. నగర్‌లోని గౌతమి రెసిడెన్షియల్ అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బంజారాహిల్స్‌లోని జేబీ ఇన్‌స్టిట్యూట్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రత్యూష తన 17- ఏళ్ల వయస్సులోనే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

Star Pratyusha Case : 2000 సంవత్సరంలో జరిగిన “టెలివిజన్ స్టార్ 2000” ‘మిస్ లవ్లీ స్మైల్’ (Miss Lovely Smile) అవార్డును ప్రత్యూష గెలుచుకుంది. ఈ గుర్తింపుతో ఆమెకు సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘రాయుడు’ (1998) సినిమాలో దర్శకుడు పి. శరత్ ఇచ్చిన అవకాశంతో ప్రత్యూష టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సినీ నటిగా ప్రత్యూష 12 తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. శ్రీరాములయ్య (1998) లో ఒక చిన్న పాత్రలో కనిపించిన ప్రత్యూష కృష్ణవంశీ దర్శకత్వంలో సముద్రం సిని మాలో ‘చంటి’ అనే పాత్రలో నటించారు.స్నేహమంటే ఇదేరా (2001)లో అమృత అనే పాత్రలో పోషించింది. కలుసుకోవాలని (2002) ఈ సినిమా ఆమె మరణానికి ముందు విడుదలైన ప్రముఖ చిత్రం. చిరంజీవులు (2001) ఈ సినిమాలో కూడా ఒక పాత్ర పోషించారు. మొత్తం మీద అగ్ర నాయకులు నటించిన సినిమాల్లో పాత్ర పోషించింది.
Star Pratyusha Case : ప్రేమ విష వలయంలో.. చిక్కింది ఇలా..

ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ్ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది సుమారు 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లి చేసుకోవాలని ప్రత్యూష భావించింది. సిద్ధార్థ తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించకలేదు. హీరోయిన్‌గా ప్రత్యూష రాణిస్తున్నప్పడు సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య విబేదాలు వచ్చాయి. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వీళ్లిద్దరూ విషం తీసుకున్నారు. చికిత్స కోసం కేర్ హాస్పిటల్ కు తరలించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది.
ఈ కేసును హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో (Cr.No.144/2002) నమోదు చేశారు. ప్రత్యూష ఆత్మహత్యపై ఆమె తల్లి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా విచారణను CBI (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కు అప్పగించారు. చికిత్స అనంతరం మార్చి 9 న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది. సీబీఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్ వేసింది.

Star Pratyusha Case : 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, ఈ తీ ర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనకూలంగా తీర్పు రావడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది. చంచలగూడ జైలులో అతడు శిక్షను అనుభవించాడు. సుప్రీంకోర్టు రెండేళ్లే జైలు శిక్ష ఖరారు చేసినందున.. సిద్ధార్థ రెడ్డి జైలులో స్వల్ప కాలమే ఉంటాడని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ స్వల్ప కాలం జైలుకు సిద్ధార్థ రెడ్డి వస్తాడా? రాడా అనేది మరి కొంత మంది ప్రశ్న.
