Mayor | నిలుకడకు…నిబద్ధతకు పట్టం

Mayor | నిలుకడకు…నిబద్ధతకు పట్టం
రామగుండం మేయర్ గా మహంకాళి స్వామి
డిప్యూటీ మేయర్గా పాతిపెల్లి ఎల్లయ్య
Mayor | గోదావరిఖని, ఆంధ్రప్రభః సంచలనాత్మక నిర్ణయాలకు… విలక్షణమైన తీర్పులకు ఎప్పుడు రామగుండం పారిశ్రామిక నగరం ఒక వేదికగా అవుతుంది. ఇక్కడ మేయర్ అభ్యర్థి ఎన్నిక రసవత్తరంగా… ఆసక్తికరంగా ఉంటుంది. ఏ పార్టీ నుండి గెలిచిన చివరకు మేయర్ ను ఎన్నుకోవడం ఇక్కడ ఊహకు భిన్నంగా జరుగుతూ వస్తుంది. అయితే…. ప్రస్తుతం అందరూ ఊహించినట్లుగానే నిలకడకు…. నిబద్ధతకు…. విధేయతకు పట్టం కట్టారు. 46వ డివిజన్ నుండి కార్పొరేటర్ గా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహంకాళి స్వామి రామగుండం మేయర్ గా ఎన్నికయ్యారు. స్థానిక రామగుండం కార్పొరేషన్ లో జిల్లా పరిషత్ సీఈఓ నరేంద్ర అధ్యక్షతన ఎన్నిక కొనసాగింది. 57 డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన పాతిపెళ్లి ఎల్లయ్యను డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు.
రామగుండంలో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ పార్టీ 38 డివిజన్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చెందిన 6 గురు కార్పొరేటర్లు మద్దతునిస్తూ కాంగ్రెస్లో చేరారు. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ల చేరడంతో మొత్తం కాంగ్రెస్ బలం 47 కు చేరుకుంది.. అదేవిధంగా ఎన్నిక కార్యక్రమంలో సిపిఐ పార్టీకి చెందిన అభ్యర్థి ఒకరు, బిజెపి పార్టీకి చెందిన అభ్యర్థి ఒకరు, మరొకరు స్వతంత్ర అభ్యర్థి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన 11 మంది కార్పొరేటర్లు ఎన్నిక కార్యక్రమానికి హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ అఫీషియస్ రామగుండం ఎమ్మెల్యే ఓటును కలుపుకొని మొత్తంగా 50 మంది కాంగ్రెస్ బలం పెరిగింది.రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో క్రిఏసీలకంగా పని చేస్తూ పార్టీని వీడకుండా ముందుకు సాగిన మహంకాళి స్వామికే రామగుండం మేయర్ గా అవకాశం లభించింది.
అభివృద్ధిలో రామగుండము అగ్రస్థానంలో నిలుపుతా
రామగుండం నూతన మేయర్ మహంకాళి స్వామి
రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అభివృద్ధిలో రామగుండం కార్పొరేషన్ అగ్రస్థానంలో నిలుపుతానని నూతనంగా ఎన్నికైన రామగుండం మేయర్ మహంకాళి స్వామి స్పష్టం చేశారు. రామగుండం ఎమ్మెల్యే సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో పరిపాలన అంతా కూడా పారదర్శకంగా జరుగుతోందని మహంకాళి స్వామి నొక్కి చెప్పారు. తనపై నమ్మకంతో మేయర్ గా ఎన్నుకున్న పార్టీ అధిష్టానానికి, సహకరించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు, తోటి కార్పొరేటర్లకు మహంకాళి స్వామి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

