80 feet | తక్షణమే మరమ్మతులు చేపట్టాలి…

80 feet | తక్షణమే మరమ్మతులు చేపట్టాలి…
- రేషన్, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి…
- అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్…
80 feet | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు జీరో అవర్ సమయంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా, శ్రీకాకుళం పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలో 80 ఫీట్ రోడ్డులో ఉన్న బాంబే కాలనీ, రాజీవ్ గృహకల్ప గృహ సముదాయాల దయనీయ స్థితిని ఆయన ప్రస్తావించారు.
ఈ గృహ సముదాయాలు నిర్మించి సుమారు 30 ఏళ్లు కావడంతో అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, దీనివల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలకు ప్రాణాపాయం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక వ్యక్తి బాల్కనీ గోడ కూలి కింద పడిపోవడంతో రెండు కాళ్ళు విరిగిపోయాయని సభకు వివరించారు. ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా, గృహ నిర్మాణ శాఖ వెంటనే స్పందించి ఆయా భవనాలకు మరమ్మతులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇదే సందర్భంలో, లబ్ధిదారులకు అందజేసిన టిడ్కో ఇళ్లలో కనీస సౌకర్యాలు కూడా లేవని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రస్తావించారు. ఆ ప్రాంతాల్లో రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టిడ్కో ఇళ్ల సముదాయాల్లో వెంటనే రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
