Ravi l లడ్డూ కల్తీ హిందూ ధర్మంపై దాడి..

Ravi l లడ్డూ కల్తీ హిందూ ధర్మంపై దాడి..
వైసీపీ హయాంలో జరిగిన ఘోర తప్పిదం
భక్తుల విశ్వాసాలతో చెలగాటం
2022 లోనే హెచ్చరికలు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం
సిట్ నివేదికలో కల్తీ నిర్ధారణ బాధ్యులపై కఠిన చర్యలు అవసరం
అసెంబ్లీలో పేజీ టు పేజీ చర్చకు సిద్ధం
భక్తులకు, దేవుడు కి క్షమాపణ చెప్పాల్సిందే..
శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు
Ravi l ఎన్టీఆర్ బ్యూరో,ఆంధ్రప్రభ: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ ఘటన కేవలం పరిపాలనా వైఫల్యం కాదని, ఇది నేరుగా హిందూ మత విశ్వాసాలపై జరిగిన దాడిగా చూడాల్సిందేనని శాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు అన్నారు. వైసీపీ పాలనలో దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారుచేసి భక్తులకు పంపిణీ అయ్యాయని, ఇంత భారీ స్థాయిలో జరిగిన వ్యవహారాన్ని తక్కువ స్థాయి అధికారుల తప్పిదంగా చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని వ్యాఖ్యానించారు. అప్పటి దేవస్థాన పాలకవర్గానికి చెందిన కీలక నేతలే కల్తీ జరిగిన విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటు కాదని, వ్యవస్థాగతంగా జరిగిన ఘోర తప్పిదమని ఆరోపించారు.
2022లోనే లడ్డూ తయారీలో అనుమానాలు ఉన్నాయని, భక్తులు కూడా అప్పుడే లడ్డూ వాసన, రుచిపై ప్రశ్నలు లేవనెత్తారని తెలిపారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోకుండా, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ద్వారా అసలు సమస్యను దాచిపెట్టిందని విమర్శించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని అన్నారు. ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో పాలు లేకపోవడం, ఇతర జంతు సంబంధిత పదార్థాలు, రసాయనాల వినియోగం జరిగినట్లు తేలిందని తెలిపారు. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారయ్యిందంటే అది నెయ్యి ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇది భక్తుల విశ్వాసాలతో చేసిన మోసమని, వెంకటేశ్వర స్వామి నామంతో కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఘటనగా పేర్కొన్నారు.
ఇంతటి దారుణ ఘటన జరిగినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి, దేవస్థాన పాలకవర్గం, సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటివరకు భక్తులకు క్షమాపణ చెప్పలేదని రవి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత వహించాల్సిన వారు ఎదురుదాడులకు దిగడం సరికాదని, ప్రజల విశ్వాసాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులదేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరగాలని, సిట్ నివేదికను పేజీ టు పేజీగా పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయాల పరిపాలనలో పారదర్శకత ఉండాలని, భక్తుల విశ్వాసాలను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని తెలిపారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో పాలుపంచుకున్న అధికారులు, సరఫరాదారులు, పాలకులు ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత వ్యవస్థలు ఏర్పాటు చేయాలని షాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.
