Avanigadda | జగన్మోహనరెడ్డి రాక్షస క్రీడకు తెర తీశారు

Avanigadda | జగన్మోహనరెడ్డి రాక్షస క్రీడకు తెర తీశారు
- జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్
Avanigadda | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి రాక్షస క్రీడకు తెర తీశారని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించిన ఆవు నెయ్యి తయారీకి అసలు కొంచెం కూడా ఆవు నెయ్యి వాడకుండా జంతు కొవ్వుతో తయారు చేసిన రసాయనాలతో ఉత్పత్తి చేసిన అనారోగ్యకరమైన నెయ్యిలాంటి కలుషిత పదార్ధం వినియోగించినట్లు అత్యున్నత ల్యాబ్ నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో కుల కుంపటి రగిల్చేందుకు అంబటి రాంబాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నీఛమైన బూతులు మాట్లాడించి వికృత క్రీడకు ఆజ్యం పోశారని భగ్గుమన్నారు. బూతుల రాంబాబును భుజాన వేసుకొని జగన్ సాధించింది ఏంటని ప్రశ్నించారు.
రాంబాబుని కాపు టైగర్ అని పొగిడి కాపు సామాజిక వర్గాన్ని అవమానించారన్నారు. కాపు కుల ప్రతిష్టను నిలబెట్టే పని ఒకటైనా రాంబాబు చేశారా? అని ప్రశ్నించారు. కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు అంటూ తిట్టిన రాంబాబు ఈ రోజు కాపు టైగర్ ఎలా అయ్యారని ప్రశ్నించారు. దేశ క్రికెట్ జట్టు మొదటి టెస్ట్ కెప్టెన్ సీకే నాయుడు, మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి కూర్మా వెంకటరెడ్డి నాయుడు, గొప్ప మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు, బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి మచిలీపట్నం కోనేరు సెంటర్లో స్వరాజ్ జెండా ఎగరవేసిన స్వతంత్ర సమరయోధుడు తోట నరసయ్య నాయుడు, దానశీలి గన్నబత్తుల పెదతాత ఇలాంటి మహానుభావులు కాపు సామాజిక వర్గంలో ఉన్నారని తెలిపారు. వీళ్ళ గురించి మాట్లాడాలిగానీ సత్తెనపల్లిలో ఒక మైనర్ బాలుడు చనిపోతే వచ్చిన పరిహారం సగం లంచంగా తినేసిన అంబటి రాంబాబును గురించి పొగిడి అతనో సంస్కారవంతుడు, టైగరు, పొగడాలి, సన్మానాలు చేయాలి అంటుంటే జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా నేషనల్ మీడియాకు చెప్పిన దానికి వైసీపీ వద్ధ సమాధానం ఉందా? అని ప్రశ్నించారు. కులాల కుంపట్లు రగల్చాలనే జగన్ ఆలోచనను ఎంతమాత్రం ప్రజలు హర్షించరు అన్నారు.
రాష్ట్రంలో ఎంతోమంది గొప్ప కాపు నాయకులు ఉండగా, గతంలో కాపులను చులకనగా మాట్లాడిన అంబటి రాంబాబును కాపు కుల నాయకునిగా ప్రమోట్ చేసేందుకు జగన్ విఫల యత్నం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రజల విశ్వాసాలతో, తిరుమల పవిత్రతతో రాజకీయం చేయటం మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహనరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్ చేశారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతభత్యాలు తీసుకునే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. జగన్ ఇలాగే సభకు రాకుండా రోడ్డు ఎక్కి అరాచకాలు చేద్దామనుకుంటే ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు. సమావేశంలో లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, కటికల వసంత్, జనసేన పార్టీ మండల నాయకులు బచ్చు శ్రీహరి, తుంగల నరేష్, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, దేవస్థానం డైరెక్టర్లు కోసూరు అవినాష్, మత్తి శివపార్వతి, తోట సోమశేఖర్, వార్డ్ సభ్యుడు కమ్మిలి సాయిభార్గవ, బాలమ్మ పాల్గొన్నారు.
