Pakisthan | ఆడి గెలవలేక సాకులా..?

Pakisthan | ఆడి గెలవలేక సాకులా..?
- భారత్‌తో మ్యాచ్ ఆడేదిలే..
- పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
- బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిర్ణయం
Pakisthan |వెబ్‌డెస్క్. ఆంధ్రప్రభ : పాకిస్థాన్ వక్రబుద్ది ఎప్పటికీ మారదని మరోసారి రుజువైంది. ఆటలకు, రాజకీయాలకు ముడిపెడుతూ తన అక్కసును భారత్‌పై వెళ్లగక్కుతోంది. ప్రతీ విషయంలో భారత్‌ను ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తుంటుంది. కానీ చివరికి పాకిస్థాన్‌యే పెద్దగోతిలో పడ్తదనే విషయాన్ని మరిచిపోతుంది. ఇప్పడు పొట్టి ప్రపంచ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ దేశ ప్రధాని పిచ్చి ప్రకటన చేశాడు. దీనికి క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఎవర్రా మీరంతా.. ఎక్కడ దొరికార్రా బాబు.. మీరు ఇక మారరా.. అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటలకు, రాజకీయాలకు సంబంధం ఏమిటని దుమ్మెత్తిపోస్తున్నారు. భారత్‌పై పాకిస్థాన్ గెలవలేక లేనిపోని సాకులు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దాయాదులైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆసక్తి నెలకొంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తినడంతో ప్రత్యక్షంగా సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ వరల్డ్ కప్‌లాంటి టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు ఆడుతున్నాయి. అయితే మరో రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో పాక్, భారత్ రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి. అయితే మ్యాచ్ జరగడంపై సందిగ్ధం నెలకొంది. భారత్‌లో భద్రతా కారణాల వల్ల తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ కోరగా, ఐసీసీ అందుకు నిరాకరించింది. ఫలితంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం, బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏమన్నాడంటే..?
అయితే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడే విషయంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. “భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని మేము ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకున్నాం. ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు, అన్ని కోణాల్లో క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు. ప్రస్తుతం మేము బంగ్లాదేశ్‌కు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాం” అని షరీఫ్ పేర్కొన్నారు.

ఐసీసీ సీరియస్..
పాక్ ప్రధాని వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఎంపికచేసుకుని మ్యాచ్‌లు ఆడటం గ్లోబల్ టోర్నమెంట్ స్ఫూర్తికి విరుద్ధం. అన్ని అర్హత పొందిన జట్లు షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిందే. ఇది క్రికెట్ సమగ్రత, న్యాయం, పోటీ తత్వాన్ని దెబ్బతీస్తుంది. జాతీయ విధాన విషయాలలో ప్రభుత్వాల పాత్రలను ఐసిసి గౌరవిస్తుంది. అయినప్పటికీ ఈ నిర్ణయం ప్రపంచ క్రీడకు లేదా పాకిస్థాన్‌లోని లక్షలాది మంది అభిమానుల సంక్షేమానికి అనుకూలంగా లేదు. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన సొంత దేశంలో క్రికెట్‌కు ఉన్న ముఖ్యమైన, దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఐసిసి ఆశిస్తోంది. ఎందుకంటే ఇది ప్రపంచ క్రికెట్ పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పీసీబీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నాం’ అని ఐసీసీ పేర్కొంది.

పీసీబీకి నష్టం..
ఒకవేళ పాక్ గనుక మ్యాచ్‌ను బహిష్కరిస్తే, పీసీబీకి వచ్చే వార్షిక ఆదాయంలో కోత విధించడంతో పాటు, భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల నిర్వహణ హక్కులను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టు షెడ్యూల్ ప్రకారం మైదానంలోకి రాకపోతే, ప్రత్యర్థి జట్టుకు వాకోవర్ లభిస్తుంది. అంటే, భారత్ ఆడకుండానే 2 పాయింట్లు సాధిస్తుంది. అయితే, క్రికెట్ ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ మ్యాచ్ రద్దు కావడం బ్రాడ్‌కాస్టర్లకు, ఐసీసీకి కోలుకోలేని దెబ్బే. ప్రస్తుతానికి పాక్ జట్టు శ్రీలంక చేరుకున్నప్పటికీ, ఫిబ్రవరి 15న వారు భారత్‌తో తలపడతారా లేదా అన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది.

ఏం జరిగిందంటే..
భద్రతా కారణాలంటూ భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. భారత్‌లో భారత్‌లో జరగాల్సి ఉన్న తమ మ్యాచ్‌ల వేదిక మార్చాలని కోరింది. అయితే దీనిని ఐసీసీ తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో మ్యాచ్‌లు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఐసీసీ స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా తీసుకుంది. దీంతో ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం, బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది.

