AP | వ‌న్‌స్టాప్ సెంట‌ర్ల‌తో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా..

AP | వ‌న్‌స్టాప్ సెంట‌ర్ల‌తో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా..

  • బాధిత మహిళలకు గౌరవం, న్యాయం కల్పించేందుకు కృషి..
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : వ‌న్ స్టాప్ సెంట‌ర్లు (ఓఎస్‌సీ).. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నాయ‌ని.. బాధిత మ‌హిళ‌ల‌కు గౌర‌వం, న్యాయం క‌ల్పించేందుకు కృషిచేస్తున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఈ రోజు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఇగ్నైట్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. సఖి వన్ స్టాప్ సెంటర్‌కు కేటాయించిన ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ మహిళలపై హింసను అరికట్టడం, బాధిత మహిళలకు తక్షణం, సమగ్ర సహాయం అందించ‌డంలో స‌ఖి – వ‌న్ స్టాప్ సెంట‌ర్ కీల‌క‌పాత్ర పోషిస్తోంద‌న్నారు. బాధిత మ‌హిళ‌ల‌కు ఒక్కచోటే అవసరమైన అన్ని సేవలు పొందేలా ఈ కేంద్రాలు చేయూత‌నిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

ఈ ప్ర‌త్యేక వాహ‌నంతో బాధితులకు త్వరితగతిన కౌన్సిలింగ్, వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సహాయం వంటి సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు వీల‌వుతుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌తో పాటు అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోంద‌న్నారు. మ‌హిళా సాధికార‌త‌తో పాటు మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదిగేలా చేసేందుకు అహ‌ర్నిశ‌లు కృషిచేస్తోంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, విజయవాడ అర్బన్ సీడీపీవో జ్యోత్స్న, మిషన్ శక్తి కోఆర్డినేటర్, సూపర్వైజర్లు, ఆంగన్‌వాడీ కార్యకర్తలు, సఖి వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply