Collector | రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…
Collector | రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…
- జిల్లా కలెక్టర్ కె. హరిత
Collector | ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వివిధ వార్డులు, పలు విభాగాలను పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగులను వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రక్త నిల్వ గదిని పరిశీలించి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై విచారించి వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారిలో సామాన్యులు, ఆదివాసి గిరిజనులు ఎక్కువగా ఉంటారని, వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు.
వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. రోగుల ఆరోగ్య స్థితిగతులపై వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుబోద్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
