Amaravati | అమరజీవి స్మృతివనం..

Amaravati | అమరజీవి స్మృతివనం..
Amaravati, విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతిగా నిర్మిస్తున్న పొట్టి శ్రీరాములు స్మృతివనం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పెదపరిమి సమీపంలో 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ స్మృతివనంలో మొదటి స్లాబ్ పనులను రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహ ఏర్పాటు పనులు ప్రణాళికబద్ధంగా వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రజల స్ఫూర్తికి నిలువెత్తు చిహ్నంగా ఈ స్మృతివనం నిలవనున్నదని, రాష్ట్ర చరిత్రలో ఇది ఒక గొప్ప గుర్తుగా నిలుస్తుందని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చే మార్చి 16, 2026 నాటికి విగ్రహాన్ని పూర్తి చేసి ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేష్ మాట్లాడుతూ.. అమరావతిలో ఈ స్మృతివనం కోసం ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించడంలో మంత్రి నారాయణ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అమరజీవి సేవలను తరతరాలకు గుర్తు చేసేలా స్మృతివనాన్ని తీర్చిదిద్దేందుకు ట్రస్ట్ కట్టుదిట్టంగా పని చేస్తోందని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలను సజీవంగా నిలిపే విధంగా ఈ స్మృతివనం రూపుదిద్దుకుంటుందని, ఇది అమరావతికి ఒక ప్రధాన ఆకర్షణగా మారనుందని అధికారులు వెల్లడించారు.
