silver price| భూమిలో పరిమితం.. డిమాండ్ మాత్రం అనంతం: వెండి ధరల పరుగెందుకో..

silver price| వెండి ఇక ఆభరణాల లోహం కాదు
పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ పెంచుతున్న వెండి డిమాండ్
సరఫరా తగ్గడం.. ధరల పెరుగుదలకి ప్రధాన కారణం
పెట్టుబడిదారుల దృష్టిలో వెండి ఎందుకు సురక్షిత పెట్టుబడి?
ప్రపంచంలో వెండి లభ్యత ఉన్న ప్రధాన దేశాలు
భారత్‌కు వెండి దిగుమతులు: అవకాశాలు, పరిమితులు
సోలార్ నుంచి శాటిలైట్స్ వరకూ వెండి వినియోగం
వెండి భవిష్యత్: తాత్కాలిక ధోరణి కాదు, దీర్ఘకాలిక వాస్తవం
silver price | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఖనిజం..చమురు…ఏదైనా సరే..భూమి లోపలి నుంచి ఎంతుంటే అంతవరకే తవ్వి తీసుకోగలం కానీ, తిరిగి పండించలేం, పునరుత్పత్తి చేయలేం..అందుకే డిమాండ్ పెరిగినకొద్దీ ఎంత ధరైనా పెట్టి కొనడమే తప్ప, లభ్యత విషయంలో ఏమీ చేయలేం. వెండి ధర పెరుగుదల విషయంలో ప్రస్తుతం అదే జరుగుతున్నది. భవిష్యత్తులో డిమాండ్-సప్లై మధ్య అంతరం భూమికీ ఆకాశానికీ మధ్య దూరమంత పెరిగిపోనున్నది.
అందుకు సంకేతాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నవి. ఇటీవల కాలంలో వెండి ధరలు ఎన్నడూ లేనంతగా పెరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలోవెండిని బంగారానికి ప్రత్యామ్నాయంగా మాత్రమే భావించేవాళ్ళం. కానీ, ప్రస్తుత, భవిష్యత్ ప్రపంచ సాంకేతిక అవసరాల్లో, ముఖ్యంగా పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, ఇవే కాక సురక్షిత పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇలా అనేక ఆర్థిక విషయాలతోనూ ముడిపడి కీలకమైన లోహంగా మారింది.

మరి ఇంత ముఖ్యమైన భవిష్యత్ అవసరాలకు కీలకమైన వెండి ధర భవిష్యత్తులో ఎంతవరకు పెరగొచ్చు? అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. భారత్‌కు వెండి సరఫరా ఎలా ఉంది? అనేది ఇక్కడ ప్రాధాన్యమైన అంశం. వెండి ధర పెరుగుదల కారణాల్లో ముఖ్యమైనవి పరిశ్రమల్లో వెండి వినియోగం భారీగా పెరగడం ఒక ప్రధాన కారణం. అందుకే వెండి ఇప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఒక పారిశ్రామిక అవసరం.
ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ తయారీకి, ఎలక్ట్రిక్ వాహనాల్లో కొన్ని భాగాలకు, 5జీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఈ రంగాల్లో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లడంతో సోలార్ రంగంలో వెండి డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. కనుక ఈ పారిశ్రామిక అవసరాలకు వెండి తప్పనిసరి. దానికి తోడు వెండి లభ్యత, సరఫరా తగ్గడం కూడా వెండి ధరను పరుగులు పెట్టిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వెండి గనులు చాలా తక్కువగా కనుగొనబడుతున్నాయి.
పైగా వెండి ఎక్కువగా కాపర్, లీడ్, జింక్ వంటి లోహాల మైనింగ్‌లో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. ఆ లోహాల ఉత్పత్తి తగ్గితే వెండి సరఫరా కూడా తగ్గిపోతుంది. పైన ఉదహరించినవన్నీ ఉత్పత్తికి సంబంధించిన అంశాలు. ఇక సరఫరా, కొనుగోలు, ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక విషయాలకొస్తే, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, అమెరికా డాలర్ బలహీనపడినప్పుడు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెట్టుబడిదారులు వెండిని ఒక సురక్షితమైన పెట్టుబడిగా చూడడం, కొని దాచుకోవడం వల్ల కూడా వెండి ధర పెరుగుతోందని ఆర్థికవేత్తల అంచనా.

ప్రస్తుతం వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఎందుకంటే బంగారం ధరలు అధికంగా ఉండటంతో, చిన్నచిన్న పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయంగా వెండిపై దృష్టి పెట్టారు. ఏట్Fలు, ఫ్యూచర్స్ ట్రేడింగ్ వల్ల కూడా డిమాండ్ పెరిగింది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం వెండి ధర ఇంకా ఎంతవరకు పెరగొచ్చంటే.. అంతర్జాతీయంగా వెండి ధర ఔన్స్‌కు 35–45 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని ఒక అంచనా. భారత మార్కెట్‌లో వెండి ధర కిలోకు ₹1,10,000 నుంచి ₹1,30,000 వరకు చేరవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.
భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వేగం పెరిగడం వల్ల, చైనా, అమెరికా, యూరప్ లలో వెండి డిమాండ్ పెరగడం వల్ల, వెండి ధర మరింత ఎగబాకే అవకాశం ఉంది. ప్రపంచదేశాల్లో వెండి లభ్యత విషయానికొస్తే, మెక్సికో – వెండి ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా..చైనా, పెరూ, రష్యా, ఆస్ట్రేలియా, బొలీవియా తదితర దేశాలున్నాయి. ఈ దేశాల్లోనూ వెండి నేరుగా కాకుండా ఇతర లోహాల మైనింగ్‌లో భాగంగా లభిస్తోంది. అందుకే సరఫరా నియంత్రణ అంత సులభం కాదు.
భారత్‌కు వెండి మెక్సికో, పెరూ, ఆస్ట్రేలియా, రష్యా, (రీఫైన్డ్ సిల్వర్) నుండి దిగుమతి అవుతుంది ఎందుకంటే వెండి ఉత్పత్తిలో భారత్ లో దేశీయంగా చాలా తక్కువ మైనింగ్ మాత్రమే జరుగుతోంది. మరొక కీలకైమైన అంశం ఏమిటంటే, మనం ఎంతవరకు దిగుమతి చేసుకోవచ్చు? అంతర్గతంగా, అంతర్జాతీయంగా పరిమితులు ఏమైనా ఉన్నాయా అంటే, అంతర్గత పరిమితులు దిగుమతి సుంకాలు, జీ.ఎస్.టీ. విదేశీమారక లభ్యత, వాణిజ్య లోటు ప్రభావితం చేస్తాయి. ఇక అంతర్జాతీయ పరిమితుల విషయానికొస్తే, వెండి ఎగుమతి చేసే దేశాల్లో మైనింగ్ నియంత్రణలుం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశాల మధ్య రవాణా, బీమా ఖర్చులు ఇలా అనేక అంశాలు వెండి దిగుమతులపై ప్రభావం చూపుతాయి.
ప్రస్తుతం భారత్‌కు డిమాండ్‌కు తగినంత వెండి దిగుమతి చేసుకునే సామర్థ్యం ఉంది, కానీ ధరలు పెరిగితే మాత్రం ఖర్చు భారమవుతుంది. ఆభరణాల కంటే వెండి ఇంకా ఇతర చాలా అవసరాలకు వెండి ప్రాధమిక అవసరంగా మారింది. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్‌లో కీలక భాగం, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సర్క్యూట్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, చిప్స్ వీటికి వెండి చాలా అవసరం. వైద్య రంగం విషయానికొస్తే, యాంటీబ్యాక్టీరియల్ కోటింగ్, మెడికల్ పరికరాల తయారీలో, వెండి వినియోగం ఎక్కువే. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంతరిక్ష పరికరాలు, ఉదాహరణకు రాకెట్స్, రక్షణ రంగంలో శాటిలైట్స్, మిస్సైల్ టెక్నాలజీ ఇలా వెండి వినియోగం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో.
వెండి ఇకపై కేవలం ఆభరణాల కోసం మాత్రమే ఉపయోగపడే లోహం కాదు. ఇది భవిష్యత్ సాంకేతికతకు ప్రాణం. సరఫరా పరిమితులు, డిమాండ్ పెరుగుదల, గ్లోబల్ మార్పుల నేపథ్యంలో వెండి ధరల పెరుగుదల తాత్కాలికం కాదు, దీర్ఘకాలిక ధోరణి. పెట్టుబడిదారులు, పరిశ్రమలు, దేశాలన్నీ వెండిని వ్యూహాత్మక లోహంగా చూడటం మొదలుపెట్టాయి. భవిష్యత్ అవసరాలకు వీలైనంతగా చాలా రంగాల వారు వెండిని సేకరించి దాచి ఉంచవచ్చు కూడా.
click here to read 2026 High | కొండ కాస్తా పర్వతమై..రికార్డు స్థాయికి వెండి ధరలు..
