Mopidevi | 22 నుంచి బ్రహ్మోత్సవాలు

Mopidevi | 22 నుంచి బ్రహ్మోత్సవాలు

  • మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆల‌యంలో ఏర్పాట్లు

Mopidevi | ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. 22వ తేదీ ఉదయం 11 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుడిని చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ స్వామి, అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

23వ తేదీ ఉదయం సుప్రభాత సేవ, ప్రాతః కాల్చారన, మధ్యాహ్నం 2 గంటలకు శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం. 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం రాత్రి 8 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వ‌హిస్తారు. 24వ తేదీ రాత్రి 8 గంటలకు రథోత్సవం జరగనుంది. 25వ తేదీ ఉదయం 9 గంటలకు వసంతోత్సవం, అవభృద స్నానోత్సవం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి మాల దీక్షా విరమణ పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు వేద విద్వత్ సభ, పండిత సత్కారం, రాత్రి 7 గంటలకు శమీ వృక్ష పూజ, 8 గంటలకు మయూర వాహనంపై రావివారిపాలెం గ్రామం వరకు గ్రామోత్సవం ఉంటుంది. 26వ తేదీ 10 గంటలకు బ్రహ్మణ్య హవనం. సాయంత్రం 7 గంటలకు పుష్కరిణిలో స్వామిఅమ్మవార్ల తెప్పోత్సవం, రాత్రి 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, 9 గంటలకు పుష్పశయ్యాలంకృత పర్యాంక సేవ ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ దేవాలయంలో జరిగే నిత్య ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేయ‌నున్న‌ట్లు ఆలయ ఈవో తెలిపారు.

Leave a Reply